అధికార పార్టీ నాయకుడైతే అరెస్ట్ చేసేవారా.?

61

తెలంగాణ పోలీసులు ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించారని సాక్షాత్తూ హైకోర్టు తెలంగాణ పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి అరెస్ట్ పై హైకోర్టుకు వచ్చి డీజీపీ స్వయంగా వివరణ ఇవ్వాల్సిందేనని స్ఫష్టం చేయడంతో.. డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు వచ్చారు.

నిఘావర్గాలు ఇచ్చినట్లుగా చెబుతున్న నివేదికలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వాటన్నింటిపై హైకోర్టు అనుమానాలు వ్యక్తంచేసింది. ఒక్క నివేదికపైనా అధికారుల సంతకాలు, తేదీలు, అధికారిక ముద్రలు కూడా లేవని, నిఘావర్గాలే వాటిని ఇచ్చినట్టు ఎలా నమ్మాలని నిలదీసింది. కేవలం తమకు ఇవ్వడానికే సృష్టించినట్టున్నాయే కానీ నమ్మశక్యంగా లేవని వ్యాఖ్యానించింది.

పోలీసుల వ్యవహరించిన తీరు పక్షపాతంతో ఉందని కోర్టు ఆక్షేపించింది. అధికారపార్టీ సభను జరగనివ్వబోమని చెప్పినందుకే రేవంత్‌ను అరెస్ట్‌ చేసారా?. అదేమాట అధికార పార్టీ నాయకుడు చెప్పి ఉంటే అరెస్ట్ చేసేవారా?అని న్యాయమూర్తి ప్రశ్నించారు.  ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరు అది కాదని స్పష్టంచేసింది. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఓ పద్ధతి ఉండాలని, హుందాగా వ్యవహరించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా న్యాయమూర్తి పదే పదే ప్రశ్నించారు. పూర్తి వివరాలతో ఈ నెల 12న కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణను17కి వాయిదా వేసింది.