పైరసీ తప్పేం కాదంటున్నసగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు

1493

ఏ సామాజిక బాధ్యత లేని తెలుగు సినిమా ప్రముఖుల మీద ఓ సగటు సినిమా ప్రేక్షకుడు సంధించిన శరాఘాతమే ఈ పోస్ట్…ఆయన ఆవేదన ఆయన మాటల్లోనే….

——————————————————-
నా ఉద్దేశ్యంలో పైరసీ తప్పేం కాదు ఎందుకంటే……పైరసీని అరికట్టండి, స్టాప్ పైరసీ, కిల్ పైరసీ, అది మీ బాధ్యత అంటూ మన అభిమాన తెలుగు హీరోహీరోయిన్లూ, దర్శక నిర్మాతలూ ప్రెస్ మీట్లు పెట్టి వీరావేశంగా ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తుంటే నాకు నవ్వొస్తుంది.

మా కష్టాన్ని దోచేసుకుంటున్నారు, మా కుటుంబాలు రోడ్డున పడతాయి అంటూ సినిమా రిలీజ్ కి ముందే వీళ్ళు ఏడ్చే ఏడ్పులు చూస్తుంటే నాకు పెద్ద బాధగా ఏం అనిపించదు. ఎస్, నా ఉద్దేశ్యంలో పైరసీ పెద్ద తప్పేం కాదు. నేను దీనిని వ్యతిరేకించను. అసలు ఎందుకు వ్యతిరేకించాలి? సినిమా అనేది మీ వ్యాపారం, పైరసీ అనేది వాళ్ళ వ్యాపారం , మీ వ్యాపారం మీరు చేసుకుంటున్నట్టే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. మీ సమస్యను అరికట్టటానికి మా ప్రేక్షకులెందుకు సహకరించాలి? మా ప్రేక్షకుల సమస్యను అరికట్టటానికి మీ సినిమా వాళ్ళెపుడైనా ముందుకి వచ్చారా?

ఎవడి సినిమా రిలీజైతే వాడు మీడియా ముందుకొచ్చి పైరసీని అరికట్టమంటాడు, లేకపోతే అన్యాయం జరిగిపోతుందంటాడు. కానీ ప్రేక్షకుడికి జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కడూ ఆలోచించడు. మా కష్టాన్ని తీసుకొచ్చి టిక్కెట్లుగా మార్చి మిమ్మల్ని మేం పోషిస్తుంటే మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీ సినిమావాళ్ళెప్పుడైనా ప్రశ్నించారా?

వేలాది ధియేటర్లలో తమ సినిమాను రిలీజ్ చేయాలనే తాపత్రయం తప్ప ఆ ధియేటర్ లో ప్రేక్షకులకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేది మీరు పట్టించుకోనంత కాలం మేమూ జరుగుతున్న పైరసీని పట్టించుకోం. బ్లాక్ లో టిక్కెట్లను అమ్ముకుంటూ ప్రేక్షకుల సొమ్మును దోచుకుంటున్న ధియేటర్ల మీద మీరు ఏ చర్యలు తీసుకోనంత కాలం మేమూ పైరసీ మీద ఏ చర్యలూ తీసుకోము. తిరగని ఫ్యాన్ల గురించీ, కడగని బాత్రూముల గురించీ, చిరిగిన సీట్ల గురించీ, విరిగిన కుర్చీల గురించీ మీరేరొజైనా పట్టించుకున్నారా? మరి మేమెందుకు జరిగే పైరసీ గురించి పట్టించుకోవాలి?

telugu cinema piracy is not badపైరసీ తప్పేం కాదంటున్నసగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు

ఏ ధియేటర్లోనూ సరైన తాగునీటి సౌకర్యం ఉండదు, ఫస్ట్ ఎయిడ్ సౌకర్యం ఉండదు, అగ్ని ప్రమాదాల వంటివి జరకుండా తీసుకోవాల్సిన కనీస రక్షణ సౌకర్యాలు ఉండవు. నిన్న మొన్నటి సమోసాలు, పాచిపోయిన తినుబండారాలు, నిల్వైపోయిన వాటర్ పేకట్లు మాకు అధిక ధరలకు అమ్ముతుంటే ఇదేంటని మీరు అడిగారా? కూల్ డ్రింక్స్, పాప్ కార్న్, ఐస్ క్రీమ్ వంటివి రెట్టింపు ధరలకు అమ్ముతుంటే కనీసం మీరు నోరెత్తి ఇదేం అన్యాయమని మీరెప్పుడైనా అడిగారా? మరి మేమెందుకు పైరసీ గురించి పోరాడాలి?

రోజురోజుకీ పెరుగుతున్న టిక్కెట్ ధరలను తట్టుకుని, అడ్డంగా దోచేసుకుంటున్న ధియేటర్ల దౌర్జన్యాలను తట్టుకుని ధియేటర్లకి వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు చేసే స్తోమత లేని ప్రేక్షకుడు పైరసీ సీడీల మీద ఆధారపడక ఏం చేస్తాడు? పైరసీ పోవాలంటే ముందు ధియేటర్లను, అక్కడ ఉన్న లోపాలనూ, జరుగుతున్న అన్యాయాలనూ చక్కదిద్దండి. సగటు ప్రేక్షకుడు సంతోషంగా కుటుంబంతో పాటు ధియేటర్ కి వచ్చి సినిమా చూస్తాడు.

పైరసీని అరికట్టడం మీ భాద్యత అని మీరు ప్రేక్షకులకు సందేశాలు ఇస్తుంటే నాకు నవ్వొస్తుంది, భాద్యత గురించి మీరా మాట్లాడేది? మీ సినిమా అవకాశాల మీద, వ్యాపారాల మీద తప్ప ఈ దేశం మీద కానీ, ఈ రాష్ట్రం మీద కానీ, ఈ ప్రజల మీద కానీ మీకసలు భాద్యత ఉందా?

రాష్ట్రం రెండుగా విడిపోతుంటే ఒక్కడు నోరెత్తలేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఒక్కడు నోరెత్తలేదు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే ఒక్కడు నోరెత్తలేదు. జనమేమైపోయినా పర్లేదు, ఎంతసేపూ మీ సినిమాలు మీ వ్యాపారాలు బాగుంటే చాలు. ఆ తమిళ హీరోలను చూసి బుద్ది తెచ్చుకోండి. ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం వాళ్ళు ఎలా పోరాడతారో చూస్తున్నారా, వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోవాలి మీరు.

తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం మీరు చేసిందేమీ లేదు. మీవరకూ సినిమా అనేది ఒక వ్యాపారం. ఆ వ్యాపారానికి నష్టం వస్తుందనుకున్నపుడే ప్రజలు గుర్తొస్తారు మీకు. రాష్ట్రం విభజనకు గురై సంక్షోభంలో ఉన్నా ఏసీ గదుల్లోంచి బయటకు రాని మీకు పైరసీ నుంచి కాపాడమనే హక్కు లేదు. అది మీ వ్యక్తిగత వ్యాపార విషయం. దానికి ప్రజలను జవాబుదారీ చేయొద్దు.

ఇది ఒక సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడి అభిప్రాయం

– నిక్కచ్చి అయిన తెలుగు సినీ ప్రేక్షకుడు
——————————————————-