కర్ణాటక ఫలితమే ఆంధ్రాలో రిపీట్ అవుతుందట

101

క‌ర్ణాట‌క ఫ‌లితాల అనంత‌రం అమెరికాలో ఉన్న భాజ‌పీ ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావు సోష‌ల్ మీడియా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసారు. ఆ వీడియోలో ఆంధ్రాలో కీల‌క రాజ‌కీయ‌శ‌క్తిగా ఎదుగుతామ‌ని అన్నారు. కర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌కు ఎదురైన పరిస్థితే ఏపీ సీఎం చంద్రబాబుకు ఎదురవుతోందన్నారు.

తెలుగుదేశం పార్టీకి ఇప్ప‌టికైనా బుద్ధి రావాల‌నీ, ప్ర‌చారమే ప్ర‌భుత్వం అనుకుంటూపోతే సిద్ధ‌రామ‌య్య కంటే దారుణ‌మైన ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎలాగూ పోతుంద‌నీ, రాష్ట్రంలో తీవ్ర‌మైన అవినీతి ఎదుర్కొంటున్న తెదేపా భాజ‌పాతో బంధం తెంచుకోవ‌డం వ‌రంగానే భావిస్తున్నామ‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల త‌మ‌కు ఉన్న చిత్త‌శుద్ధిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌నీ, క‌ర్ణాట‌క‌లో అక్క‌డి ప్ర‌జ‌లు ఏవిధంగా అయితే బ్ర‌హ్మ‌ర‌థం పెట్టారో ఆంధ్రాలో త‌మ‌కు అంత‌కుమించి త‌మ‌ను కోరుకుంటున్నార‌ని అన్నారు. కర్ణాట‌క‌, త్రిపుర‌, మ‌హారాష్ట్ర ఎక్క‌డైనా స‌రే ప్ర‌జ‌లు త‌మ‌నే కోరుకుంటున్నార‌ని జీవీఎల్ స్ప‌ష్టం చేసారు. ఆంధ్రాలో అదరహో అనిపిస్తామని ఆశాభావం వ్య‌క్తం చేసారు.

క‌ర్ణాట‌క‌లో మాదిరిగా ఆంధ్రాలోనూ ప్ర‌భావం చూపుతామ‌ని జీవీఎల్ అంటున్నారు. నిజానికి, క‌ర్ణాట‌క‌లో సిద్ధ‌రామ‌య్య‌కు ముందు భాజ‌పా ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆంధ్రాలో ఆ స్థాయిలో ప్ర‌భావితం చూపిన గ‌తం లేదు. కాబ‌ట్టి, క‌ర్ణాట‌క ఫ‌లిత‌మే ఆంధ్రాలో రిపీట్ అవుతుంద‌ని ఆశించ‌డం అనేది కల్ల. క‌ర్ణాట‌క ఫ‌లితాల్లో సంఖ్యాబ‌లం చాల‌క వారు ప్ర‌స్తుతం సాగిస్తున్న రాజ‌కీయాలను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్ కూట‌మికి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌గ‌ల సంఖ్యా బ‌లం ఉన్నా ఆ రెండు పార్టీల నుంచి ఎమ్మెల్యేల‌ను లాక్కునేందుకు వారు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ఏ త‌ర‌హా విలువ‌ల‌తో కూడిన‌వో జీవీఎల్ చెప్పాలి.