‘రోబో2’ని బాగానే వాడుకుంటున్నారు

142

రోబో-2 రిలీజ్ డేట్ విషయంలో ఆ టీమ్ తలమునకలై పోతుంది. ఈ సినిమాతో మిగిలిన సినిమా నిర్మాతల్లో వణుకు మొదలైంది. రోబో 2 డేట్ ఫిక్స్ అయితే తప్ప, మిగిలిన పెద్ద సినిమాల రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రాదని వేసవికి రావాలన్న సినిమా నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మహేష్ బాబు, కొరటాల శివ సినిమా ‘భరత్ అను నేను’ నిర్మాత డి.వి.వి దానయ్య గళం వరుస ట్వీట్లు చేసారు.

తెలుగులో పెద్ద సినిమాలన్నీ వేసవి విడుదలకి కసరత్తు చేస్తున్నాయని, నిర్మాతలందరూ మాట్లాడుకుని, రిలీజ్ డేట్ విషయంలో పరస్పర అంగీకారానికి వచ్చామని, రోబో2 మాత్రం ఈ విషయంలో ఆందోళన కలిగిస్తోందన్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. దానయ్య ఆవేదన, ఆందోళనలలో అర్ధం ఉంది కానీ ఆయన ఏం చేసారో చూద్దాం. అల్లు అర్జున్ సినిమా ‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ఏప్రిల్ 27 న రిలీజ్ డేట్ ప్రకటిస్తే, మహేష్ సినిమాని కూడా ఏప్రిల్ 27 నే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అలాంటప్పుడు ఒకే పరిశ్రమలో సాటి నిర్మాత ప్లానింగ్ ని గౌరవించాల్సిన అవసరం ఆయనకు లేదా?

తన సినిమా రిలీజ్ విషయంలో మరో సినిమా అడ్డు పడుతోందని ఆవేశపడితే ఏమనాలి.? రోబో2కి ‘తమిళ సినిమా’ అనే కార్డు వాడాలని చూస్తున్నారు. డబ్బింగ్ సినిమాల నుంచి తెలుగు సినిమాలని కాపాడుకోవటంలో తప్పు లేదు. కానీ ఇదే నిర్మాతలు అదే సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం ఎగబడిపోతుంటారు. అప్పుడు తెలుగు తమిళ అనే తేడా ఉండదు. డబ్బింగ్ సినిమాలను  స్వప్రయోజనాల కోసం కొంతమంది నిర్మాతలు ట్రంప్ కార్డుగా వాడుకుంటున్నారు. ఈ రోబో వ్యవహారం చూస్తుంటే మున్ముందు ఏం జరుగుతుందో మరి.