భాజపాకి తెలుగు వారి ఎదురుగాలి తగిలింది

67

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ముప్ఫై నుంచి న‌ల‌భై నియోజ‌క వ‌ర్గాల్లో అక్క‌డ స్థిర‌ప‌డ్డ తెలుగువారి ప్ర‌భావం ఉంటుంద‌న్న ఆందోళ‌న భాజ‌పాకి మొద‌ట్నుంచే ఉన్నదే. ఏపీ విషయంలో భాజ‌పా అనుస‌రిస్తున్న నిర్ల‌క్ష్య వైఖ‌రికి నిర‌స‌న‌గా అక్క‌డి ప్ర‌జ‌లు వ్య‌తిరేక ఓటేస్తారేమో అనే ఆందోళ‌న ఆ పార్టీలో ముందే నెల‌కొంది.

ఈ నేపధ్యంలో తెలుగువారి ప్ర‌భావ‌మున్న ప్రాంతాల్లో ర‌క‌ర‌కాల వ్యూహాల‌ను అమ‌లు చేసారు. ప్రజల్లో విభ‌జ‌న తీసుకొచ్చేందుకు ఎత్తులూ పైఎత్తులూ వేసారు. అయినా సరే అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తెలుగు వారు ప్ర‌భావం చూప‌గ‌లిగారనే చెప్పాలి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా భాజ‌పా ఎదిగింది. 104 స్థానాల్లో విజ‌యం సాధించింది. కానీ, సొంతంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ ను సింగిల్ గా అందుకోలేక‌పోయింది.

తెలుగు ప్ర‌జ‌లు కీల‌కం అనుకున్న రెండు జోన్ల‌లోనూ భాజ‌పాకి మ‌రికొన్ని సీట్లు అదనంగా వచ్చి ఉంటే, సొంతంగా అధికారం ద‌క్కించుకునే అవ‌కాశం ఉండేది. హైద‌రాబాద్-క‌ర్ణాట‌క రీజియ‌న్ లో చూసుకుంటే… భాజ‌పాకి 15 సీట్లొచ్చాయి. కాంగ్రెస్ కి 21, జేడీఎస్ కి 4 ద‌క్కాయి. తెలుగువారు అత్యధికంగా బెంగ‌ళూరు సిటీ, రూర‌ల్ ప్రాంతాల్లో కూడా భాజ‌పాకి గ‌ట్టి ఎదురుదెబ్బే త‌గిలింది. ఈ ప్రాంతంలో మొత్తం 34 స్థానాల‌కి గాను 11 మాత్ర‌మే ద‌క్కించుకోగ‌లిగింది.

తెలుగు ప్ర‌జ‌లు కీల‌కం అనుకున్న ప్రాంతాల్లో భాజ‌పాకి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింద‌నేది వాస్త‌వం. అయితే ఈ ప్రాంతాల్లో గ‌తంతో పోల్చితే ఎక్కువ స్థానాలే దక్కించుకున్నామ‌నీ, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో 6 నుంచి 15 సీట్ల‌కు ఎదిగామ‌ని రామ్ మాధ‌వ్ అంటున్నారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అంశం చర్చనీయం కాలేదు. నేటి ఫలితాల్లో మ‌రో ప‌ది సీట్లు అద‌నంగా వ‌చ్చి ఉంటే సింగిల్ గానే భాజ‌పా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకోగ‌లిగేది. ఎవ‌రు కాదన్నా భాజ‌పాకి తెలుగువారి ఎదురుగాలి బాగానే వీచింది.