తెల్లనివన్నీ పాలు కావు – మెరిసేదంతా బంగారం కాదు

327

పక్షులు రకరకాల రంగుల్లో ఉంటాయి. అంతమాత్రాన వాటి గుడ్లు రంగుల్లో ఉండవు. గుడ్లు అన్నీ తెల్లగానే ఉంటాయి. గుడ్లు తెల్లగా ఉన్నంత మాత్రాన గుడ్లలో పక్షిపిల్లలు తెల్లగా ఉండవు…అవి రకరకాల రంగుల్లో ఉంటాయి!!

రాజకీయ నాయకులు, పార్టీలు రకరకాల రంగులు పూసుకుంటాయి. రకరకాల నీతులు చెప్తాయి. సిద్ధాంతాలను వల్లిస్తాయి. చివరకు అవి ఆచరించే బాట మాత్రం ఒకటే. మేము అధికారంలోకి రాగానే అవినీతిని అంతం చేస్తాము. అవినీతిపరులను జైళ్లలో తోయిస్తాము అని ప్రజలను ఊదరగొడతారు. ఇవాళ కాంగ్రెస్ మోసం చేసింది అని ఆగ్రహంతో మనం బీజేపీ కి ఓట్లు వేస్తాము. అధికారంలోకి రాగానే బీజేపీ కూడా అదేబాటలో పయనిస్తుంది. బీజేపీ మోసం చేసింది అని ఆగ్రహంతో మళ్ళీ ఆడే కాంగ్రెస్ కు పట్టం కడతాము. అప్పుడు వారు కూడా అంతే.

“కాంగ్రెస్ పార్టీ లక్షల కోట్ల అవినీతికి, కుంభకోణాలకు పాల్పడ్డది. మేము అధికారంలోకి రాగానే అందరినీ జైల్లో పడేస్తాం” అని మోడీ వాగ్దానం చేసారు. ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కాంగ్రెస్ నాయకుడు ఒక్కడు కూడా జైలుకు వెళ్ళలేదు. ఆ కుంభకోణాల తాలూకు లక్షల కోట్లలో లక్షరూపాయలు కూడా బీజేపీ వసూలు చెయ్యలేకపోయింది. కామన్వెల్త్ క్రీడల్లో కోట్లాది రూపాయలు మింగారని షీలాదీక్షిత్ మీద, సెల్యూలర్ సంస్థలకు అనుమతుల విషయంలో మారన్ సోదరులు, కనిమొళి, అలాగే చిదంబరం తదితరులమీద విచారణ జరిపి శిక్షిస్తామని ఘనంగా డబ్బాలు కొట్టారు బీజేపీ నాయకులు. ఏరీ? ఒక్కడు.. ఒక్కడన్నా కనీసం విచారణను ఎదుర్కొన్నాడా?

All politicians are from the same flockతెల్లనివన్నీ పాలు కావు – మెరిసేదంతా బంగారం కాదు

ఇక విజయ్ మాల్యా విషయం మరీ దారుణం. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాల్యా బ్యాంకులకు పదివేల కోట్లు ఎగ్గొట్టి దర్జాగా లండన్ చెక్కేసాడు. కేంద్రప్రభుత్వం దేభ్యపుముఖం వేసుకుని చూసింది. దేశంలో ఉన్నప్పుడు పెట్టుకోకుండా, లండన్ పారిపోయాక అక్కడినుంచి తెస్తాము అని మాయమాటలు చెప్తూ ఇప్పుడు ప్రజలను వంచిస్తున్నది. ఇంట్లో ఉన్నప్పుడు దొంగను వదిలేసి, పారిపోయాక పట్టుకుంటాము అని బీరాలు పలుకుతున్నది. సిబిఐ విచారణ చేయిస్తాము అని ఒక మంత్రి చెపుతాడు. లండన్ నుంచి మాల్యాను తీసుకురావడం సాధ్యం కాదు అని అదే సమయంలో మరొక కేంద్ర మంత్రి సన్నాయి నొక్కులు నొక్కుతుంటాడు. లండన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి మాల్యా జుట్టుపట్టుకుని లాకొస్తాము అని చెప్తుండగానే, లండన్ కోర్టు మాల్యా పై విచారణను వాయిదా వేస్తుంది. మనదేశం లో బెయిల్ ను మహా అయితే ఒక నెలరోజులు పొడిగిస్తారు. కానీ లండన్ కోర్టు మాల్యాకు బెయిల్ ను ఏకంగా ఆరుమాసాలు పొడిచి పండగ చేస్కో అని పర్మిషన్ ఇచ్చేసింది!! అవినీతి లో లండన్ కోర్టులు మనదేశాన్ని ఏనాడో మించిపోయాయి.

గత మూడేళ్ళలో అవినీతి కేసుల్లో ఒక్కరంటే ఒక్కరిని కూడా బీజేపీ ప్రభుత్వం కటకటాలవెనక్కు నెట్టలేకపోయింది. .ఎపుడో ఇరవై ఏళ్ళక్రితం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసుల్లో జయలలిత, శశికళ లాంటివారికి శిక్షలు పడ్డాయి తప్ప బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. కనిమొళి, మారన్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వమే జైలుకు పంపించింది. కానీ కాగ్రెస్ కు ప్రచారం చేసుకోవడం చేతకాదు. అవినీతిపరులను శిక్షించి కూడా కాంగ్రెస్ లాభం పొందలేకపోయింది. బీజేపీ ఏమీ చెయ్యకుండానే ఎదో అవినీతికి వ్యతిరేకంగా సమరం చేసే పార్టీగా డప్పు కొట్టుకుంటున్నది…

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతే. అధికారం లేనపుడు తెలుగుదేశం, తెరాసా అనేకమంది నాయకుల మీద అనేక రకాల ఆరోపణలు చేసింది. అధికారంలోకి రాగానే అందరినీ జైళ్లకు పంపిస్తామన్నది. ఏదీ? ఒక్కరినైనా జైలుకు పంపించారా? పైగా వీరి పాలనలోనే వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే పార్టీలు “మేము అధికారంలోకి రాగానే, విచారణలు జరిపించి అందరినీ జైలుకు పంపిస్తాము” అని ప్రచారం చేస్తారు. కానీ అధికారంలోకి రాగానే అందరూ సౌఖ్యంగా కలిసి చెట్టపట్టాలు వేసుకుంటూ తిరుగుతారు.

అందుకే పక్షులు రంగురంగుల్లో ఉంటాయి. కానీ అవి పెట్టె గుడ్లు మాత్రం ఒకే రంగులో ఉంటాయి. ఈ సత్యం తెలుసుకోకుండా పిచ్చి అభిమానులు వాళ్లలో వాళ్ళు తన్నుకుంటారు.

– ఇలపావులూరి మురళీ మోహన రావు