నేటి ఆధునిక రాజకీయ పంచతంత్రం – Part 2

177

చిత్రగ్రీవుడు అనే కపోతరాజు తన పరివారంతో ఆకాశంలో విహరిస్తుండగా వారికి ఒక అరణ్యం మధ్యలో భూమి మీద కొన్ని బియ్యపు గింజలు కనిపించాయి. వాటిని చూసి ఆశపడి పావురాలు దిగబోతుండగా “అరణ్యం మధ్యలో బియ్యం ఎక్కడినించి వస్తాయి. ఇదేదో మోసం.. దిగవద్దు” అని హెచ్చరించాడు చిత్రగ్రీవుడు. అతనిమాట వినకుండా ” కంటికి కనిపిస్తున్న ఆహారాన్ని వదులుకోవడం ఉచితం కాదు” అని పావురాలు కిందికి దిగాయి. అక్కడ ఒక వేటగాడు పన్నిన వలలో ఇరుక్కుని పోయాయి.

ఇక అప్పుడు బయటపడే మార్గం ఏమిటి? కపోతాలన్నీ దుఃఖిస్తుండగా చిత్రగ్రీవుడు “ఆపద సంభవించినపుడు దుఃఖించడం విజ్ఞుల లక్షణం కాదు. మనం చేసే పొరపాట్లు అన్నింటికీ ఆశయే మూలకారణం. బంగారు లేడి ఎక్కడా ఉండదు అని తెలిసి కూడా శ్రీరాముడు మాయలేడిని తరుముతూ వెళ్ళాడు. దురదృష్టం వాటిల్లినపుడు ఓరిమి వహించడం, అదృష్టం వచ్చినపుడు అణకువతో ఉండటం, యుద్ధంలో ధైర్యంతో మెలగడం, సభలలో ధారాళంగా ఉపన్యసించడం ధీరుల లక్షణాలు. కష్టసమయంలో ఒకరినొకరు సహకరించుకోవడం, అందరిని కలుపుకుని వెళ్లడం విచక్షణ కలిగిన వారు చెయ్యాల్సిన పని. సంఘీభావమే బలం. గడ్డిపోచ ఒంటరిగా ఏమీ చెయ్యలేదు. అదే వంద గడ్డిపోచలను త్రాడుగా పేనితే మదపుటేనుగును కూడా బంధించవచ్చు. మనం సంఘటితంగా ఉంటె ఈ వేటగాడి బారినుంచి తప్పించుకోవచ్చు” అని ఉపదేశించింది.

అప్పుడు పావురాలు అన్నీ కలిసిగట్టుగా నిలిచి బలమంతా కూడదీసుకుని పైకి లేవగా, వలతో పాటు ఆకాశంలోకి లేచిపోయాయి. ఆ దృశ్యాన్ని దిగ్భ్రముడై చూసాడు వేటగాడు. పావురాలు దొరకలేదు. దానితో పాటు తన వల కూడా పోయింది.

**************************************************************

రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని పోగొట్టుకున్నది. కమ్యూనిస్టులు గల్లంతు అయ్యారు. అయితేనేం? వారికి ప్రజల్లో ఎంతో కొంత బలం ఉన్నది. వారికి సంప్రదాయ ఓటు బాంకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ లో ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిపోయిన నాయకులు ఉన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్, దగ్గుబాటి వెంకటేశ్వర రావు, వసంత్ కుమార్, హర్షకుమార్, పనబాక లక్ష్మి, పల్లం రాజు, కన్నా లక్ష్మీనారాయణ, కేవీపీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, గాదె వెంకట రెడ్డి, వడ్డే శోభనాద్రీశ్వర్ రావు, ఇలా పదుల సంఖ్యలో నాయకులు ఉన్నారు. వీరు ఎన్నికలలో ఓడిపోవచ్చు. కానీ, వారి వారి నియోజకవర్గాలలో అంతో ఇంతో పట్టు ఉంటుంది.

అలాగే కమ్యూనిస్టులు ప్రస్తుతం తెలుగుదేశం కు వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు, మోడీ ల చేతుల్లో అవమానం పాలైన జనసేనాధిపతి దిక్కులు చూస్తున్నాడు. చంద్రబాబు లాఠీదెబ్బలు తిన్న ముద్రగడ పద్మనాభం రగిలిపోతున్నారు. కాపునాయకులు, బ్రాహ్మణ సంఘాలవారు చంద్రబాబు పాలనపట్ల కుపితులై ఉన్నారు. అలాంటి వారందరిని సంఘటితం చేసి, వారికి ఏవో పదవుల ఆశ చూపించి వారిని దారికి తెచ్చుకుని సహకారం తీసుకునే ప్రయత్నం ఎందుకు చెయ్యరు? ప్రస్తుతం నీకు అధికారం లేదు, పదవి లేదు. అవతలివారంతా ఢక్కామొక్కీలు తిన్న నాయకులు. ఒక్కసారి వారింటికి స్వయంగా వెళ్లి వారి సాయాన్ని అర్థిస్తే నీ పరువుమర్యాదలకు వచ్చిన భంగం ఏమీ లేదు.

రాజకీయ చాణక్యుడు అని ఖ్యాతి బడసిన చంద్రబాబే ఆఫ్టరాల్ పవన్ ఇంటికి ఒకటికి పదిసార్లు తిరిగి ఆయన సాయాన్ని పొంది అధికారంలోకి రాగలిగాడు. పవన్ ను తక్కువ అంచనా వెయ్యద్దు. రేపు ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే ఓట్లు చీలి చంద్రబాబు లాభపడటం ఖాయం. కనుక అహాన్ని వదులుకుని ఎన్నో కొన్ని సీట్లతో పవన్ తో పొత్తు పెట్టుకో. కమ్యూనిస్టులకు నాలుగు సీట్లు ఇచ్చినా, లక్షల ఓట్లు నీకు లభిస్తాయి. నువ్వు ఒక్క పిలుపు ఇస్తే కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతుంది.

కాకపొతే ఏమిటి? నీ ఒక్కడివల్లనే గెలుపు వస్తుందని భ్రమల్లో జీవించవద్దు. నీ ప్రత్యర్థి ఒక మదపుటేనుగు. నువ్వు గడ్డిపోచవు. మరో పది గడ్డిపోచలను కలుపుకుని మోకుగా పేని ఏనుగును బంధించు.

సశేషం

నేటి ఆధునిక రాజకీయ పంచతంత్రం – Part 1

– ఇలపావులూరి మురళీ మోహన రావు