కొన ఊపిరితో ఆంధ్రా కాంగ్రెస్?

276

స్వతంత్రం వచ్చాక ముప్ఫయి ఏళ్లపాటు భారతదేశాన్ని అవిచ్ఛిన్నంగా ఏలిన పార్టీ కాంగ్రెస్. దేశంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చిన ఘనురాలు. పేదలకోసం, రైతులకోసం, నిరుద్యోగులకోసం, పరిశ్రమలకోసం రకరకాల పధకాలను ప్రవేశపెట్టింది. పాకిస్తాన్ తో యుద్ధం చేసి, బాంగ్లాదేశ్ అనే దేశాన్ని ప్రపంచపటం మీదకు ఎక్కించిన కీర్తి కాంగ్రెస్ సొంతం. అలాంటి పార్టీ నేడు ఏ పాతాళానికి దిగజారిపోయిందో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ను హడావిడిగా చీల్చిన అపఖ్యాతి మూటకట్టుకుని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జీరో స్థాయికి పడిపోయింది. ఒకప్పుడు ప్రతిరాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రజానాయకులు ఉండేవారు. మనరాష్ట్రంలో ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, సంజీవయ్య, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ప్రాంతీయ, జాతీయ నాయకులు ఉండేవారు. ఇక జిల్లాలవారీగా చూస్తే బలమైన నాయకులు ఉండేవారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేడు ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వలోపంతో కునారిల్లిపోతున్నది. ఫలానా సీటును నేను గెలిపించగలను అని ఆత్మవిశ్వాసం తో చెప్పగలిగే నాయకుడే కరువయ్యాడు.

ఇప్పుడు నంద్యాలలో ఉపఎన్నిక జరుగుతున్నది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టిందా లేదా అనే విషయం తెలియదు. నీలకంఠాపురం రఘువీరారెడ్డి ని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు. ఏ ప్రాతిపదికన ఆయనను అధ్యక్షుడిగా నియమించారో ఆయనకే తెలియదు. తన జిల్లాలో కూడా అందరికీ తెలియని అనామకుడు ఆయన. మాట్లాడటం చేతకాదు. వాగ్ధాటి లేదు. జనాకర్షకనేత కాదు. పదిమందిని సమీకరించలేడు. ఉద్యమాలు చెయ్యడం చేతకాదు. అసలు శ్రమించడమే ఆయనకు అలవాటు లేదు. వైఎస్సార్ మంత్రివర్గంలో పదేళ్లు అధికారాన్ని అనుభవించాడు. కాంగ్రెస్కు పేరుకు మాత్రమే అధ్యక్షుడు. ఆయనను ఒక్క నాయకుడు కూడా గౌరవించడు. ఒక పోరాటం కోసం పిలుపు ఇస్తే పంచాయితీ బోర్డు మెంబర్ కూడా స్పందించడు. ఇలాంటి నాయకులతో కాంగ్రెస్ నిలదొక్కుకోవడం సాధ్యమేనా?

Is congress alive in Andhra?కొన ఊపిరితో ఆంధ్రా కాంగ్రెస్?

గత మూడేళ్ళుగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. సమస్యలు చెప్పుకోవాలంటే అనంతం. భూ కుంభకోణాలు, రాజధాని నిర్మాణం, రాజకీయ హత్యలు, దోపిడీలు.. చెప్పుకోవాలంటే పేజీలు చాలవు. అయినప్పటికీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యడం కాంగ్రెస్ వలన కావడం లేదు. ప్రజాభిప్రాయాన్ని ప్రోది చెయ్యడం సాధ్యం కావడం లేదు. కాంగ్రెస్ కు ఇంతటి బలహీన నాయకత్వం గతంలో ఎన్నడూ లేదు.

నంద్యాలలో అభ్యర్థిని నిలబెడతాము అని ప్రకటించారు రఘువీరా రెడ్డి. నిలబెట్టారో లేదో తెలియదు. వారికి జగన్ మీద ఆశలు ఉన్నట్లున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసిపి తో పొత్తు పెట్టుకోవాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. అయితే జగన్ స్వయంగా వచ్చి మమ్మల్ని అడగాలి అన్నట్లుగా వారు ప్రకటనలు చేస్తున్నారు. దీనినే మేకపోతు గాంభీర్యం అంటారు. నిజానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నకాలంలో చిరంజీవి, పనబాక లక్ష్మి, పల్లంరాజు లాంటి నాయకులు అధికార భోగాలను అనుభవించారు. ప్రస్తుతం వారెవరూ కాంగ్రెస్ వంక కన్నెత్తి చూడటంలేదు.

మొత్తానికి రఘువీరారెడ్డి గారి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత సమాధి నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. ఆయనను తొలగించి మరో శక్తిమంతుడైన నాయకుడిని నియమించకపోతే కాంగ్రెస్ కు 2019 లో జరిగేవే చివరి ఎన్నికలు.

– ఇలపావులూరి మురళీ మోహన రావు