ఎన్నికల సమరభేరి మోగించిన జగన్

262

అనంతపురం లో పదవ యువభేరి నిర్వహించడం ద్వారా వైసిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి దాదాపుగా ప్రభుత్వం పై సమరభేరి మోగించారు. చంద్రబాబు అవినీతి, వాగ్దానభంగాలను, వైఫల్యాలను ఒక్కొక్కదాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబును దాదాపు కడిగిపారేశారు. ఈ మీటింగ్ లో జగన్ ఉపన్యాసాన్ని చూస్తే అసెంబ్లీ లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ అడుగడుగునా గుర్తుకొచ్చారు. సాక్ష్యాధారాలు, వీడియో క్లిప్పింగ్స్, గణాంకాలు, ప్రత్యేకహోదా తో లాభాలు మొదలైన అన్ని అంశాలతో చంద్రబాబు ప్రభుత్వాన్ని పూర్తి ఆత్మరక్షణలో పడేసారు. ఆవేశం, ఆలోచన, విజ్ఞత జగన్ ప్రసంగంలో ముప్పేటహారం లా మెరిసాయి అనడంలో సందేహం లేదు.

ముఖ్యంగా ప్రత్యేకహోదా అంశాన్ని విద్యార్థులలో రగిలించారు. హోదావలన లాభాలను, హోదా కలిగిన రాష్ట్రాలు పొందుతున్న ప్రయోజనాలను విద్యార్థులకు వివరించడంలో సఫలీకృతులైనారు. జగన్ ప్రసంగం సుదీర్ఘంగా సాగి చర్వితచర్వణం లా అనిపించినప్పటికీ, విద్యార్థుల నుంచి వచ్చిన ప్రతిస్పందన చూపరులను ఆకర్షించింది. ఇక హోదా అనేది ముగిసిన అంశంగా ఇప్పటికే కేంద్రం పలుమార్లు ప్రకటించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే జగన్ అసలు నెరవేరుతాయా అన్న సందేహం పట్టి పీడిస్తున్నది. ఒకరకంగా కేంద్రం మీద యుద్ధం లాంటిదే జగన్ ప్రసంగం. అయితే ఎక్కడా కేంద్రప్రభుత్వాన్ని, మోడీని విమర్శించకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే చివరి అస్త్రంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తానని మరోసారి ప్రకటించడం ద్వారా సరికొత్త వివాదానికి తెరలేపారు. ఎందుకంటే గతంలో ఒకసారి జూన్ లోపల హోదా రాకపోతే ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ప్రకటించి వెనక్కు తగ్గారు. అప్పుడు జగన్ మీద తెలుగుదేశం నాయకులు విమర్శనాస్త్రాలు సంధించారు. అప్పుడు వాటికి సమాధానం చెప్పని జగన్ మళ్ళీ అదే హెచ్చరిక చెయ్యడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. జగన్ ముందూ వెనుకా చూసుకుంటున్నారా లేదా అనే అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే రేపు ఆయన పాదయాత్రకు కోర్టు అనుమతి రావాల్సి ఉన్నది. వస్తుందని ఆశిస్తున్నారు కూడా. మరి ఇప్పుడు ఈ ప్రకటన కేంద్ర పెద్దలకు ఆగ్రహం కలిగిస్తుందా అనే శంక కలుగుతున్నది.

JS Jagan called YSRCP cadre to be ready for elections any timeఎన్నికల సమరభేరి మోగించిన జగన్

గత మూడేళ్ళలో వైసిపి నిర్వహించిన పదవ యువభేరి ఇది. ఆమధ్య వైసిపికి చెందిన ఒక ప్రముఖ నాయకురాలు నాతో మాట్లాడుతూ “జగన్ ఉద్యమాలు చేస్తున్నాడు, యువభేరీలు నిర్వహిస్తున్నాడు. కానీ, ఆ మరునాడు అందరూ ఆ వేడిని కొనసాగించడం లేదు. ఏ పోరాటం అయినా జగన్ ప్రత్యక్షంగా ఉంటె తప్ప ఫాలో అప్ ఉండటం లేదు. ఆ వేడిని కనీసం వారం రోజులపాటైనా నిలబెట్టలేకపోతున్నారు. ఇదే మాకు పెద్ద సమస్య” అని వాపోయారు.

ఆమె ఆవేదన పూర్తిగా సమంజసం. జగన్ వెళ్ళిపోయాక స్థానిక నాయకులు ఆ విషయాన్ని వదిలేస్తున్నారు. అందువల్ల గత తొమ్మిది యువభేరీల వాసనలు కూడా ఆ తరువాత కనిపించలేదు. ఇలా అయితే ఎన్ని పోరాటాలు చేసినా ప్రయోజనం ఉండదు. దీనికి నాయకత్వం తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

– ఇలపావులూరి మురళీ మోహన రావు