ఒకేసారి ఎన్నికలపై భాజపా వెనగడుగు వేస్తోందా.?

42

ప్ర‌ధాన‌ని మోడీ ఏ నిర్ణ‌యం తీసుకున్నా, అది దేశ ప్ర‌యోజన అంశంగానే చెప్తూ వ‌స్తున్నారు. ప్ర‌జ‌ల కోస‌మే, ప్ర‌జ‌ల‌పై భారం త‌గ్గించాల‌నీ, ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండాల‌నీ, ప్ర‌జాధ‌నం వృధా త‌గ్గించాలనీ ప్ర‌తీ నిర్ణ‌యానికీ దాదాపు ఇలాంటి ప్ర‌యోజ‌నాలే ప్రాతిప‌దిక అని చెబుతారు. అంటే, త‌మ ప్ర‌భుత్వం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను అస్స‌లు ఆశించ‌డం లేద‌ని చెప్ప‌డం అన్నమాట.!

గ‌తంలో కేంద్ర‌ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాలని ప్ర‌ధాని మోడీ చాన్నాళ్ళ కింద‌టే ప్ర‌తిపాదించారు. మ‌రో ఏడాదిన్న‌ర‌లో పార్ల‌మెంటుతో పాటు వీలైన‌న్ని రాష్ట్రాల అసెంబ్లీల‌కు కూడా ఎన్నిక‌లు వ‌చ్చేలా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో కొంత స‌ర్దుబాటు చేసుకునే ప్ర‌య‌త్నాలు చేసారు. కానీ, ఉన్న‌ట్టుండీ ఇప్పుడా ప్ర‌తిపాద‌న‌పై ప్ర‌ధాని వెన‌క్కి త‌గ్గుతున్న‌ట్టు తెలుస్తోంది. జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ కూడా సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. రాజ‌కీయ నిర్ణ‌యం తీసుకుంటే నిర్వ‌హ‌ణ‌కు త‌మ‌కెలాంటి అభ్యంతరం లేద‌ని కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.

కానీ, తాజాగా మోడీ ఆలోచ‌న ఏంటంటే జ‌మిలి ఎన్నికలు 2024లో పెడ‌తాం అంటున్నారట‌. పెద్ద‌ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై ఏడాది తర్వాత ప్ర‌జ‌ల్లోని అసంతృప్తి బ‌య‌ట‌ప‌డుతోన్న కారణంగా ఉన్న‌ట్టుండి మోడీ ఆలోచ‌న ఇలా మారింద‌ని విశ్లేషకులు అంటున్నారు. ఇంకోప‌క్క‌, జీఎస్టీతోపాటు ఇత‌ర ధ‌ర‌ల పోటుతో సామాన్యుడు ఆగ్ర‌హంగా ఉన్నాడు. ఈ స‌మ‌యంలో పార్ల‌మెంటుతో పాటు, అసెంబ్లీల‌కూ ఎన్నిక‌ల‌కు వెళితే ఏదైనా తేడా కొడితే మొత్తం తుడుచుకుపోతుందనే భ‌యం భాజ‌పా పెద్ద‌ల‌కు ప‌ట్టుకుందని అంటున్నారు.  అందుకే, ఇప్పుడు రాష్ట్రాల‌తో పాటుగా లోక్ స‌భ ఎన్నిక‌లు అనే ఆలోచ‌న విర‌మించుకుంటున్నార‌ట‌.  భాజ‌పా మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుందో రాదో అనేదే ప్ర‌ధాని ప్రాధ‌మ్యంగా మారుతోందని పార్టీపై వ్య‌క్త‌మౌతున్న వ్య‌తిరేక‌త వేడి త‌గిలేస‌రికి నిర్ణ‌యాలు మారిపోతున్నాయని కధనాలొస్తున్నాయి. ఇప్పుడు ‘జ‌మిలి ఎన్నిక‌లు వ‌ద్దు’ అనే అంశానికి కూడా దేశ ప్ర‌యోజ‌నాలు అంట‌గ‌డ‌తారో లేదో చూడాలి!

SHARE