పోలవరం పూర్తవ్వాలి ..కానీ చంద్రబాబు చేతుల్లో కాదు

54
పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల్లో మరోసారి కొంత వేగం క‌నిపిస్తోంది. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ప్రాజెక్ట్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళి ఎగువ కాప‌ర్ డ్యామ్ జెట్ డ్రౌటింగ్ ప‌నుల‌ను ప్రారంభించారు. పోల‌వ‌రానికి సంబంధించిన అడ్డంకులు తొలుగుతున్నాయ‌నీ, నిధుల విష‌యం ఇక‌పై ఎలాంటి అవాంత‌రాలూ రావ‌ని ఆశాభావం వ్య‌క్తం చేసారు. కాపర్ డ్యామ్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తిచేసి, గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాల‌న్న ల‌క్ష్యంతోనే శ్ర‌మిస్తున్నామ‌ని చెప్పారు. మొత్తానికి, కేంద్రం కూడా ఏపీ విష‌యంలో కొంత సానుకూల‌త వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో పోల‌వ‌రం ప‌నులు జోరుగా ముందుకు సాగుతాయ‌నే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.
ఇదిలా ఉంటే ప్ర‌తిప‌క్షం వైకాపా గానీ, కాంగ్రెస్ నేత‌లుగానీ పోల‌వ‌రంపై వీరు వినిపిస్తున్న వాద‌న ద్వారా ఏం ఆశిస్తున్నారనేదే ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా క‌నిపిస్తోంది. తాజాగా ఏపీ కాంగ్రెస్ నేత‌లు మ‌హాపాద‌యాత్ర చేస్తున్నారు. పోల‌వ‌రం త‌మ బిడ్డ అనీ, తామే పూర్తి చేస్తామ‌ని ర‌ఘువీరా అంటుంటే బోలెడంత అవినీతి జ‌రిగింది, కావాలంటే నిరూపిస్తా అంటూ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల నుంచి చంద్ర‌బాబును త‌ప్పించాల‌ని కేవీపీ రామ‌చంద్ర‌రావు డిమాండ్ చేస్తుంటారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ క‌మిష‌న్ల కోస‌మే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్ర‌బాబు నెత్తినేసుకున్నార‌నీ, ప‌నులు నాసిర‌కంగా జ‌రుగుతున్నాయ‌నీ, అవినీతి ఏరులై పారుతోందంటూ మాట్లాడుతుంటారు.
సీఎం చ‌ంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం వ‌ద్దనుకుంటే క్షేత్ర‌స్థాయిలో ప‌నుల్ని కాంగ్రెస్ నేత‌లు, వైకాపా నేత‌లు గానీ పర్యవేక్షిస్తారా.? రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోతే పట్టించుకోవడం లేదని వారే విమర్శిస్తారు. కేంద్ర‌మే స్వ‌యంగా బాధ్య‌త‌లు తీసుకుంటే ప‌నులు వేగంగా జ‌రుగుతాయ‌ని వీరు భ‌రోసా ఇవ్వ‌గ‌ల‌రా.? దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో నిర్మిత‌మౌతున్న జాతీయ ప్రాజెక్టుల తీరు ఎలా ఉందో వారికీ తెలుసు. అవినీతి జ‌రిగిపోయిందీ, క‌మిష‌న్ల క‌క్కుర్తి పెరిగిపోయిందని చెపుతున్న వారు ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెడితే సరిపోతుంది కదా.
విమ‌ర్శ‌ల అంతిమ ల‌క్ష్య‌మేంట‌నేది క‌నీసం వారికైనా కొంత స్ప‌ష్ట‌త ఉంటే మంచిది. కేవ‌లం తెదేపాకి ప్ర‌తిష్ట ద‌క్క‌కూడ‌ద‌న్న కోణ‌మే వినిపిస్తోంది త‌ప్ప‌ అంత‌కుమించిన ప్ర‌జా ప్రయోజ‌నాలు క‌నిపించ‌డం లేదు. కేవ‌లం రాజ‌కీయ ల‌బ్ది కోణ‌మే ఈ పార్టీల‌ది అన్న‌ట్టుగా ఉంది. పోల‌వ‌రం త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని వైకాపా, కాంగ్రెస్ లు డిమాండ్ చేస్తున్నాయి. తెదేపా స‌ర్కారు కూడా అదే ప్ర‌య‌త్నంలో ఉంది. పోల‌వ‌రాన్ని ప‌ట్టించుకోవ‌డం మానేసి ఉంటే విమ‌ర్శించినా అర్థ‌ముంటుంది. పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్త‌వ్వాలి, కానీ చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ప‌నులు జ‌ర‌క్కూడ‌దు అంటే ఎలా.?
SHARE