పోలవరం వ్యవహారం మళ్ళీ మొదటికి.?

44

పోలవరం ప్రాజెక్టు వ్యవహారం మొదటికి రావడం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద ఇరకాటమే. ప్రత్యేక ప్యాకేజీ రోజుల్లో పోలవరంకు సహాయం సాధించడం ఘనవిజయంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. శాసనసభలో తీర్మానం కూడా చేసింది. ఏడాది గడిచిన తర్వాత చూస్తే వచ్చిన నిధులు 3000 కోట్లలోపే ఉన్నాయి. పైగా కాంట్రాక్టరుపై వివాదం సాగింది. రేటు పెంచి వారి బదులు తనే చెల్లించే విధంగా ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

తాజాగా కేంద్రం స్పిల్‌వే, కాఫర్‌ డాంలపై కొత్త ప్రశ్నలు తీసుకొచ్చింది. అనుమతి వచ్చే వరకూ ముందుకు వెళ్ళవద్దని ఆంక్షలు పెట్టింది. దీంతో ముఖ్యమంత్రి కావాలంటే ప్రాజెక్టు కేంద్రానికే ఇచ్చేస్తామని ప్రకటించారు. మరో వైపున భాజపా ఎమ్మెల్యేలతో సమావేశమై పరిస్థితి వివరించి వారి సహాయం పొందే ప్రయత్నాలు ప్రారంభించారు. చానళ్ళలో చర్చలలో తెదేపా  ప్రతినిధులు కొంతవరకూ విమర్శలు చేస్తున్నా ముఖ్యమంత్రి మాత్రం మెతగ్గా మిత్రపక్షంగానే రాబట్టుకుంటామని ప్రకటించారు.

ఇదే సమయంలో కెవిపి రామచంద్రరావు వంటివారు లేఖలతో ఒత్తిడి పెంచుతున్నారు.ఈ లోగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తనవైన అభ్యంతరాలతో కేంద్రానికి లేఖ రాసారు. అది కూడా పరిష్కారం కావలసి ఉంది. చెప్పిన సమయానికి పూర్తి కాదు గనక దోషం మరెవరిపైనో నెట్టడానికి చూస్తున్నారా.? ఇదంతా కావాలనే చేస్తున్నారా? అనే సందేహం కలుగుతుంది. భాజపా నేతలు మాత్రం కేంద్రం ప్రశ్నలకు సమాధానాలు రాకుండా సహకరించడం కష్టమన్నట్టు మాట్లాడుతున్నారు.

SHARE