ప్రమాదానికి రాజకీయరంగు వేయటం అవసరమా.?

45

కృష్ణాన‌దిలో విహార‌యాత్ర‌కి బ‌య‌లుదేరిన బోటు త‌ల్ల‌కిందులై 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 9మంది గ‌ల్లంత‌య్యారు. మ‌రికొంద‌రు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్థానికంగా ఉన్న జాల‌ర్లు స్పందించారు. ఒడ్డున ఉన్న‌వారు నాలుగు బోట్లేసుకుని కొంత‌మందిని ర‌క్షించారు. బోటింగ్ సిబ్బంది కూడా కొంత‌మందిని కాపాడింది. ఏదేమైనా ఇదో ఘోర ప్ర‌మాదం. దీనికి కార‌ణం అడుగ‌డుగునా క‌నిపిస్తున్న నిర్ల‌క్ష్యం. డ‌బ్బు కక్కుర్తితో అనుమ‌తి లేని బోటు న‌డిపిన యాజ‌మానుల త‌ప్పు, నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల్సిన అధికారుల నిర్ల‌క్ష్యం అచ్చుగుద్దినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సంద‌ర్భంలో ఒక బాధ్య‌త‌ గ‌ల మీడియాగా ఏం చేయాలి.? రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలను పక్కన పెట్టి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాలి.

కానీ సాక్షిలో వ‌చ్చిన క‌థ‌నం ఎలా ఉందొ చూద్దాం. ‘తక్షణమే స్పందించిన వైకాపా నేతలు’ అంటూ ఓ క‌థ‌నం రాసారు. దాని సారాంశం ఏంటంటే.. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే వైకాపా నేత‌లు స్పందించి మాద స్థ‌లానికి ముందుగా వారే చేరుకున్నార‌ట‌. వారు వ‌చ్చిన 45 నిమిషాల త‌రువాత పోలీసులు వ‌చ్చార‌ట‌. అధికార యంత్రాంగం ప‌త్తా లేకుండా పోయింద‌ని రాసారు. వైకాపా నేత‌లు పార్థ సార‌ధి, జోగు ర‌మేష్‌, ఉద‌య‌భానుల‌తోపాటు కొంత‌మంది అనుచ‌రులు ప‌ది నిమిషాల్లోనే ప్ర‌మాద స్థ‌లానికి చేరుకున్నారు. స్థానికుల స‌మ‌న్వ‌యంతో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. ఆ త‌రువాత పోలీసులు వ‌చ్చి, స‌హాయ చ‌ర్య‌లు చేప‌డుతున్న వైకాపా నేత‌ల‌పై దౌర్జ‌న్యం చేసార‌నీ, వారిని అడ్డుకున్నార‌ని రాసారు. పోలీసులు వెంట‌నే రాక‌పోవ‌డంతో ‘బాధ్య‌త గ‌ల ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు’గా తాము స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టామ‌నీ, త‌మ వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డం కోస‌మే పోలీసులు దౌర్జ‌న్యం చేసార‌నీ, ప‌క్కన నిల‌బ‌డి స‌హాయ‌క చ‌ర్య‌లు పర్య‌వేక్షిస్తామ‌ని చెప్పినా పోలీసులు అనుమ‌తించ‌లేద‌ని నేత‌లు వాపోయిన‌ట్టు రాసారు.

వాస్తవాలు మాట్లాడుకుంటే ఒక ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు సాటి మ‌నిషికి సాయం చేయ‌డానికి ‘బాధ్య‌త గ‌ల ప్ర‌తిప‌క్ష నేత‌లై’ ఉండాలా..? మాన‌వ‌త్వం సరిపోదా.? ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు కాకపోతే ఇలాంటి స‌మయంలో సాయం చేయ‌రా..? ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. స్థానికంగా ఉన్న‌వారంతా స్పందించారు. వీలైనంతమందిని కాపాడే ప్ర‌య‌త్నం చేసారు. దీనికి కూడా రాజ‌కీయ రంగు పూసి రాసేస్తే ఏమ‌నుకోవాలి..? ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు ఘ‌ట‌నాస్థలికి పేరున్న నాయ‌కులు అనుచ‌రుల‌తో వెంట‌నే వెళితే భద్రతకు ఇబ్బందులు ఎదురు కావా.? ప్ర‌మాద వార్త‌ల్లో కూడా రాజకీయ రంగు అవసరమా.?

SHARE