సంక్రాంతి పుంజు కాలు దువ్వుతుందా.?

29
సంక్రాంతి వచ్చేస్తోంది. కోడి పందాల టెన్ష‌న్ కూడా పెరిగిపోతోంది. ఇంత‌కీ ఈ ఏడాది పందాలు ఉంటాయా ఉండ‌వా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే, హైకోర్టు నో అన‌డంతో క‌ట్టుదిట్టంగా పోలీసుల బందోబ‌స్తు పెంచ‌డం, కొంత‌మంది పందెం రాయుళ్ళను అదుపులోకి తీసుకోవ‌డం, క‌త్తులు క‌ట్టేవారిని కూడా ముంద‌స్తుగా నిర్బంధించ‌డం జ‌రుగుతోంది. అయితే, పందాల మీద చాలా ఆశ‌లు పెట్టుకుని ఏర్పాట్లు చేసుకున్న‌వారికి టెన్ష‌న్ మాత్రం పోవటం లేదు. ఈ నేప‌థ్యంలో నాయ‌కులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు కూడా కొంత చిత్రంగానే ఉంటున్నాయి.
ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చిత్ర‌మైన లాజిక్ ను తెర‌మీదికి తీసుకొచ్చారు. రెండు కోళ్ళు ఒక‌దానికొక‌టి ఎదురుప‌డితే స‌హ‌జంగానే కొట్టుకుంటాయ‌ట‌, ఆ స‌మ‌యంలో వాటి చుట్టూ న‌లుగురు గుమ్మిగూడ‌తార‌ట‌. ఈ గొడ‌వ‌ల్ని కోర్టులు ఆప‌లేవ‌నీ, మ‌నుషులు మాత్ర‌మే ఆప‌గ‌ల‌రని సెల‌విచ్చారు. పందాల‌కు హైకోర్టు నో అని చెప్పినా, ఇదో సంప్ర‌దాయమని దీనిపై స్టే తెస్తానంటూ ర‌ఘురామకృష్ణ‌రాజు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు . గ‌త ఏడాది కూడా కోడి పందాల‌పై హైకోర్టు సీరియ‌స్ అయితే ఆయ‌నే ఢిల్లీకి వెళ్ళి స్టే తెచ్చారు.
నిర్వాహ‌కులు, ఔత్సాహికులు, కోళ్ళు కొట్టుకుంటే ఆపాల‌ని చూసేందుకు సిద్ధంగా ఉన్న ప్రేక్ష‌కులు ఇలాంటివారంతా స్టే కోసం చూస్తున్నారు. దీంతో హైకోర్టు ఆదేశాల అమ‌లు పరిస్థితి ప్ర‌శ్నార్థ‌కంగానే క‌నిపిస్తోంది. చింత‌మ‌నేని వంటి నాయ‌కులు కూడా కోర్టు ఆదేశాల‌కు విరుద్ధంగానే స్పందిస్తున్న‌ట్టు చెప్పుకోవాలి. కోర్టు ఆదేశాలు ఉన్నాయ‌ని తెలిసినా కోడి పందాలు చూడ్డానికి వెళ్తున్నా అంటూ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి రెండు రోజుల కింద‌టే చెప్పారు.
ఉండి ఎమ్మెల్యే కూడా ఈ ఏడాది పందాలు ఉంటాయని భ‌రోసా క‌ల్పించే ప్ర‌క‌ట‌న చేసారు. కొన్ని రోజుల కింద‌ట హోంమంత్రి రాజ‌ప్ప కూడా సంప్ర‌దాయ బ‌ద్ధంగా కోడి పందాలు ఉంటాయ‌న్నారు. వీళ్ళేమో సంప్ర‌దాయం అంటారు, కోళ్ళు కొట్టుకోవ‌డం స‌హ‌జం అంటారు. కోర్టు వ‌ద్దంటే స్టే తెస్తామంటూ బ‌య‌లుదేర‌తారు. అస‌లు స‌మ‌స్య పందాలు పేరుతో సాగే జూదం మీద అయితే సంప్రదాయం అంటారేమిటి.? దానికి అనుబంధంగా మ‌ద్యపానం, దానికి నాయ‌కుల అండ‌దండ‌లు ఉండ‌ట‌మేంట‌నేదే ప్ర‌శ్న‌?
SHARE