భాజపా కోసం ‘ఈవీఎం’లు హ్యాక్ చేసారట

1608

2014 నుంచి గత ఏడాది వరకూ భారత్ లో జరిగిన అన్ని ఎన్నికల్లో ట్యాంపరింగ్ చేసినట్లుగా సయ్యద్ సుజా అనే వ్యక్తి లండన్ వేదికగా బయటపెట్టారు.

 

లండన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా ముందుకు వచ్చిన సయ్యద్ ఈవీఎంలు రూపొందించిన ఈసీఐఎల్ నిపుణుల బృందంలో కీలక వ్యక్తిగా చెప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో మరో నలుగురితో కలిసి ఈవీఎంల ట్యాంపరింగ్ కకు పాల్పడ్డానని చెబుతున్నారు. తనతో పనిచేసిన నలుగురిని భాజపా నేతలు చంపించారని తనను కూడా చంపుతారన్న భయంతోనే విదేశాలకు పారిపోయానని చెబుతున్నారు.

ఆయన 2014 నుంచి ఏం జరిగిందో స్పష్టంగా వివరిస్తూ ఈవీఎంలు ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో ప్రత్యేకంగా డెమో కూడా ఇచ్చారు. ఈ తతంగాన్ని బ్లూంబెర్గ్ క్వింట్ న్యూస్ ఏజెన్సీ లైవ్ టెలికాస్ట్ చేసింది. భాజపా నేత గోపీనాధ్ ముండేతో పాటు అప్పట్లో ఎన్నికల ప్రధానాధికారి సంపత్ ఆధ్వర్యంలోనే ట్యాంపరింగ్ ప్రాసెస్ జరిగినట్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసిన గోపీనాథ్ ముందేను హత్య చేసారని చెప్పారు.

ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్న తన ముఠాలో అజాస్, వంశీ, కేశవ్, ప్రకాశ్, హంజాస్ తదితరులు ఉన్నారని చెప్పారు. అయితే వీరందరూ ఆ తర్వాత హత్యకు గురయ్యారని జర్నలిస్ట్ గౌరీ లంకేష్ కు ఈ వ్యవహారం మొత్తం తెలుసని దీన్ని ఆమె బయట పెట్టాలనుకున్న లోపే హత్యకు గురయ్యారని చెబుతున్నారు. గత లోక్ సభ ఎన్నికలకు సంబంధించి యూపీ, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాకి అనుకూలంగా ట్యాంపరింగ్ చేసినట్లుగా చెప్పారు.

ఈ మొత్తం వ్యవహారంలో భాజపాకి లాభం కలిగేలా రిలయన్స్, జియో అన్ని ఏర్పాట్లు చేసాయని సయ్యద్ చెబుతున్నారు. దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో జియో నెట్ వర్క్ సహాయంతో ట్రాన్స్ మిట్ చేసి ట్యాంపరింగ్ చేసారని అంటున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 201 సీట్లను ట్యాంపరింగ్ వల్ల కోల్పోయిందంటున్నారు. ఆధారాలు మొత్తం తాను మీడియాకు ఇస్తానని చెబుతున్నారు.