రివ్యూ : సహజమైన మార్పు కోసం ‘C/o కంచరపాలెం’

174

కొంత కాలంగా తెలుగు ప్రేక్షకులు రియలిస్టిక్‌ సినిమాలను ఆదరిస్తున్నారు. సమాజంలో కనిపించే వ్యక్తిత్వాలనే కథగా తెరకెక్కించే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అదే బాటలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు మరో రియలిస్టిక్‌ మూవీ ‘C/o కంచరపాలెం’ వచ్చింది. వెంకటేష్ మహా దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా కంచెరపాలెం అనే గ్రామంలో అక్కడి ప్రజలతోనే తెరకెక్కించారు. రానా సమర్పణలో రిలీజ్ చేసేందుకు ముందుకు రావటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంది..? చూద్దాం.

కథేమంటే..

నాలుగు జంటల ప్రేమకథ. స్కూలులో చదువుకునే సుందరం (కేశవ కర్రి)కి క్లాస్‌మేట్‌ సునీత (నిత్య శ్రీ) అంటే సుందరానికి చాలా ఇష్టం. స్నేహితుడి సాయంతో ఎలాగైన సునీతతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. జోసెఫ్‌ (కార్తీక్‌ రత్నం) టీనేజ్‌ కుర్రాడు. జిమ్‌లో పనిచేస్తూ గొడవలు, సెటిల్‌మెంట్స్‌ చేసే జోసెఫ్‌, భువనేశ్వరి (ప్రణీతా పట్నాయక్‌) అనే బ్రాహ్మణుల అమ్మాయిని ప్రేమిస్తాడు. గడ్డం (మోహన్ భగత్‌) వైన్‌ షాపులో పనిచేస్తూ షాప్‌లో రోజు మందుకొనే వేశ్య సలీమా(విజయ ప్రవీణా పరుచూరి)ను కళ్ళు చూసి ప్రేమిస్తాడు. గవర్నమెంట్‌ ఆఫీసులో పనిచేసే 49 ఏళ్ళ బ్రహ్మచారి అటెండర్‌ రాజు (సుబ్బారావు)  ఒరిస్సా నుంచి బదిలీపై ఆఫీసుకు వచ్చిన ఆఫీసర్‌ రాధ(రాధ బెస్సీ) తో ప్రేమలో పడతాడు. కంచరపాలెంలో మొదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాలలో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి.? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి..? చివరకు వారి కథలు ఎలా ముగిసాయి..? అన్నదే సినిమా కథ.

ఎలా ఉందంటే..

గ్రామంలోని వ్యక్తుల జీవితాలనే కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు ఎక్కడా సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేయలేదు. సినిమాను పూర్తిగా సహజంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో, ఎలా మాట్లాడతాయో అలాగే తెర మీద ఆవిష్కరించాడు. అదే సమయంలో సమాజంలో ఉన్న అంతరాలు, కులమత భేదాలను చూపించాడు. లీడ్‌ క్యారెక్టర్స్‌ ప్రవర్తన నుంచే కామెడీ పండించి ఆకట్టుకున్నాడు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కంచరపాలెంలో అక్కడి ప్రజలతో కాసేపు గడిపిన భావన కలుగుతుంది.

నాలుగు ప్రేమ‌క‌థ‌ల్ని ఎక్క‌డ ముడిపెడ‌తాడు? అనే ఆస‌క్తి ఈ సినిమా చూస్తున్న ప్ర‌తీ ప్రేక్ష‌కుడికీ క‌లుగుతుంది. ఈ క‌థ‌ల్ని ద‌ర్శ‌కుడు ముడి పెట్టిన విధానం ఆక‌ట్టుకుంటుంది. నిజానికి నాలుగు క‌థ‌ల్నీ క‌ల‌పాల్సిన ప‌ని లేదు. విడివిడిగా చూపించినా బాగుంటుంది. స్వ‌చ్ఛ‌త‌లో ఆకర్ష‌ణే కాదు, విక‌ర్ష‌ణా క‌నిపిస్తుంటుంది. ఉన్న‌ది ఉన్న‌ట్టు చూపించ‌డంలో అందాల‌తో పాటు లోపాలు కూడా బ‌హిర్గ‌త‌మ‌వుతాయి. ద‌ర్శ‌కుడు వాస్త‌విక‌త అనే మాయ‌లో ప‌డి సినిమాటిక్ విష‌యాల్ని పూర్తిగా విస్మ‌రించాడు. అందంగా క‌నిపించాల్సిన మొహాలు కూడా బేల‌గా ఉంటాయి.

ఎవరెలా..

52 మంది కొత్త తారలు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. అంతా కొత్త వారు కావటంతో అక్కడక్కడ నటనలో కాస్త నాటకీయత కనిపిస్తుంది.

ఫైనల్ గా..

మూసకు భిన్నంగా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ‘C/o కంచరపాలెం’ సినిమాలను ఆదరిస్తేనే తెలుగు సినిమాల్లో మార్పు వస్తుంది.