భాజపా గెలిచింది ..’తెరాస, వైకాపా’లు ఫెయిలయినట్లేనా.?

94

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల ప్రకటన రాగానే అందరి దృష్టి తెలుగు రాష్ట్రాలపై పడింది. కేంద్రంలోని భాజపాకు వ్యతిరేకమని చెపుతున్న తెరాస, వైకాపాల వైఖరి వెల్లడవుతుందని రాజకీయ విశ్లేషకలు చెబుతూ వచ్చారు. ఈ రెండు పార్టీలకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక పరీక్ష లాంటిదని చెప్పుకుంటూ వచ్చారు.

ఈరోజు ఆ పరీక్షను రెండు పార్టీలు ఎదుర్కొని ఫెయిలయ్యాయి. మొదటి నుండీ వైకాపా భాజపాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసాక వైకాపా నేతలు భాజపాకి మద్దతు ఇవ్వడం వల్లే ఏపీకి సాయం చేయడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఈ నేపధ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో భాజపా కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసి చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని జగన్ ప్రకటించారు.

ఎన్నిక సమయం రానే వచ్చింది. కాసేపట్లో ఎన్నిక జరుగుతుందనగా తాము ఓటింగ్‌కు బహిష్కరిస్తున్నట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో విపక్షాలకు వచ్చే ఓట్లు తగ్గిపోయాయి. ఈ విధంగా భాజపాకి వైకాపా సాయం చేసినట్లయింది. భాజపా, కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసాయి కాబట్టి ఎవరికీ ఓటు వేయట్లేదని వైకాపా చెబుతున్నా ‘యూటర్న్‌’ వెనక భాజపా ముద్ర బలంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను కూడా భాజపా ప్రభుత్వం పరిష్కరించలేదు. ఒక వైపు తెలంగాణను కేంద్రం పట్టించుకోడం లేదని తెరాస నేతలు విమర్శలు చేస్తున్నా భాజపాకే మద్దతు తెలిపారు. దీనిని సాకుగా చూపి విపక్ష పార్టీలు విమర్శల వేడిని పెంచే అవకాశం ఉంది. ఏదేమైనా రెండు పార్టీలు ఇరకాటంలో పడినట్లయింది.