కాంగ్రెస్ పోరాడలేదు ..పంచాయితీ ఎన్నికల్లో తెరాస ‘హవా’

3124

తెలంగాణ‌లో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ తెరాస మ‌ద్ద‌తుదారులే హ‌వా కొన‌సాగించారు. శాసనస‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన త‌రువాత జ‌రిగే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌హ‌జంగానే అధికార పార్టీల‌కే అనుకూలంగా ఉంటాయి.

క్షేత్ర‌స్థాయి ఎన్నిక‌ల్లో కూడా తెరాస మ‌ద్ద‌తుదారుల హ‌వా క‌నిపిస్తోంది. మొద‌టి విడ‌త‌లో దాదాపు 4వేల‌కు పైగా పంచాయతీల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. 700ల‌కు పైగా ఏక‌గ్రీవ‌మైన వాటిల్లో కూడా ఒక‌టో రెండో త‌ప్ప‌, అన్నీ తెరాస మ‌ద్ద‌తుదారుల‌కు అనుకూలంగానే ఉన్నాయి. సోమ‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెరాస అనుకూల ప‌వ‌నాలే బ‌లంగా ఉన్నాయి. మిగిలిన రెండు ద‌శ‌ల ఎన్నిక‌ల్లో కూడా తెరాస హవా కొనసాగుతుందనే చెప్పొచ్చు.

నిజానికి, అసెంబ్లీ ఎన్నిక‌ల వైఫ‌ల్యం నుంచి పార్టీ శ్రేణుల‌ను వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌కి తెచ్చేందుకు ఈ పంచాయ‌తీ ఎన్నిక‌ల్ని అవ‌కాశంగా మార్చుకోవాల‌ని కాంగ్రెస్ భావించింది. దానిపై రాష్ట్ర నేతల మధ్య కొంత చర్చ జరిగింది. కానీ, చివ‌రికి వ‌చ్చేసరికి ఆ త‌ర‌హా ప్ర‌య‌త్న‌మేదీ కాంగ్రెస్ నుంచి క‌నిపించ‌లేదు. దీంతో ఈ ఎన్నిక‌లు తెరాస మ‌ద్ద‌తుదారుల‌కు న‌ల్లేరు మీద న‌డ‌కగా మారిపోయింది.

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కూడా ధ‌న‌ ప్ర‌వాహం కొన‌సాగింద‌నే చెప్పుకోవ‌చ్చు. ఎమ్మెల్యే ఎన్నిక‌ల కంటే ఓటు రేటు పెరిగింద‌ని  ప్ర‌జ‌లే చెప్తున్నారు. గ‌తంలో పంచాయ‌తీ ఎన్నిక‌లంటే స్థానిక స‌మ‌స్య‌ల ప్రాతిప‌దిక జ‌రిగేవి. కానీ, ఈసారి తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా తెరాస మేనిఫెస్టోనే క‌నిపించింది.