రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలకు ‘తితిదే’ నోటీసులు

121

శ్రీవారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలకు తితిదే నోటీసులు జారీ చేసింది. తిరుమల శ్రీవారి విలువైన నగలు కనిపించడం లేదని రమణ దీక్షితులు ఆరోపిస్తుంటే ఆ నగలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని విజయసాయిరెడ్డి ఆరోపణలు ప్రారంభించారు. దీనిపై తితిదే బోర్డు సీరియస్ అయింది.

నిరాధారణ ఆరోపణలు చేస్తూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా కావాలనే వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు నోటీసులు జారీ చేసారు. రమణ దీక్షితులు ఇరవై నాలుగేళ్ళ పాటు శ్రీవారికి ప్రధాన అర్చకులుగా సేవలు అందించారు. ఆగమ సలహాదారునిగా వ్యవహరించారు. కొద్ది రోజుల క్రితం అమిత్ షా తిరుమల పర్యటనకు వెళ్ళినపుడు ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత రోజు నుంచే ఆయన తితిదేపై అనేక ఆరోపణలు ప్రారంభించారు.

రమణదీక్షితుల ఆరోపణలకు భాజపా, వైకాపా నేతలు మద్దతుగా నిలిచారు. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు రమణదీక్షితులకు నేరుగా సపోర్ట్ చేస్తూ ఆయన ఆరోపణలపై విచారణ చేయిస్తామన్నట్లుగా మాట్లాడారు. శ్రీవారి నగలన్నీ చంద్రబాబు కొట్టేసారనీ ఆయన ఇంట్లో తవ్వితే బయటపడతాయని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పడం ప్రారంభించారు.

ఈ పరిణామాలు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసాయంటూ తితిదే ఇద్దరికీ మొదటి దశగా నోటీసులు జారీ చేసింది. చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేరొన్నారు. నిజానికి ఈ నోటీసుల్ని స్వయంగా అందించడానికి ప్రతినిధులు ప్రయత్నించారు. కానీ వారు తప్పించుకు తిరగడంతో పోస్టు ద్వారా నోటీసులు పంపారు. ఈ వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మరికొంత మందికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు.