ఉత్తమ్ నియామకాన్ని అందరూ ఒప్పుకున్నట్లేనా.!

62
వ‌రుస‌గా రెండోసారి టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నియ‌మితుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా గాంధీభ‌వ‌న్ కు వచ్చిన ఆయనకు కాంగ్రెస్‌ నాయ‌కులు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అయిన వెంట‌నే పీసీసీ కొత్త కమిటీ ఏర్పాటు అవుతుంద‌ని చెప్పారు. ఈసారి క‌మిటీ సైజు త‌గ్గుతుంద‌నీ, కొంత ప్ర‌క్షాళ‌న కూడా ఉంటుంద‌ని చెప్పారు. పార్టీ ప‌నుల్లో కొంత‌మంది అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నీ, మ‌రికొంత‌మంది బాగా కృషి చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా త్వ‌ర‌లోనే బ‌స్సు యాత్ర నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు. వ‌ర్కింగ్ క‌మిటీ స‌భ్యులు, ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల నియామ‌కాల‌కు సంబంధించి కొన్ని పేర్ల‌ను ఇప్ప‌టికే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్టు చెప్పారు.
వాస్తవానికి, టీపీసీసీ అధ్య‌క్ష‌ ప‌ద‌వి కోసం చాలామంది కాంగ్రెస్ నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. ఢిల్లీ స్థాయిలో చేయాల్సిన ప్ర‌య‌త్నాలు చాలానే చేసారు. కానీ, మ‌రోసారి ఉత్త‌మ్ నే కొన‌సాగిస్తున్నారు కాబట్టి పార్టీలో వారి క్రియాశీల‌త ఏ విధంగా ఉంటుందో చూడాలి. పీసీసీ పీఠంపై బాగా ఆశ‌లు పెట్టుకున్న‌వారిలో కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి ఉన్నారు. ద‌శాబ్దాలుగా పార్టీ కోసం ప‌నిచేస్తున్న త‌న‌కు ప‌ద‌వి ఇవ్వాలంటూ ఓపెన్ గానే కోరిన సంద‌ర్భాలున్నాయి. నిజానికి, ఉత్త‌మ్ అధ్య‌క్ష‌త ప‌నిచేయ‌డం ఆయ‌న‌కు ఇష్టం లేద‌న్న అభిప్రాయం మొద‌ట్నుంచీ ఉంది. కానీ, ఇప్పుడు మ‌రోసారి ఉత్త‌మ్ నాయ‌క‌త్వంలోనే పార్టీ ఎన్నిక‌ల‌కు వెళ్ళాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.
ఈ నేప‌థ్యంలో స్పందించిన కోమ‌టిరెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా ఎవరున్నా అంద‌ర‌మూ క‌లిసి ప‌నిచేస్తామ‌ని చెబుతున్నారు. అంతేకాదు, ఉత్త‌మ్ అధ్య‌క్షుడిగా ఉంటే తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాద‌నే మాట ముగిసిపోయిన అంశ‌మ‌ని వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని ఆశించిన మాట వాస్త‌వ‌మేన‌నీ, కానీ అధిష్టానం సూచ‌న‌లు మేర‌కు న‌డుచుకోవాల‌ని చెపుతున్నారు. అసంతృప్తి ఉన్నా ఈ సంద‌ర్భంలో బ‌హిర్గ‌తం చేయ‌లేరు క‌దా. ఇక‌, జానారెడ్డి, పొన్నాల స్పంద‌న‌లు ఏంటో కూడా తెలియాల్సి ఉంది. ఉత్త‌మ్ కు సీనియ‌ర్ నేత‌లైన జైపాల్ రెడ్డి, వీహెచ్ కూడా బాగానే స‌హ‌క‌రిస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో హైక‌మాండ్ ద‌గ్గ‌ర త‌న‌కు ప‌ట్టుంద‌ని మ‌రోసారి అప్ర‌క‌టితంగానే సందేశం ఇచ్చిన‌ట్టు కూడా అర్థం చేసుకోవ‌చ్చు. ఉత్తమ్ ను పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగించ‌డంపై భిన్నాభిప్రాయాలున్నా బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు త‌క్కువే.
SHARE