రాహుల్ ముందు కూడా అదే ట్రిక్ వాడతారా.?

117

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఎవ‌రు? అనే అంశ‌మై ఎప్ప‌టిక‌ప్పుడు టీకాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక చ‌ర్చ జ‌రుగుతూ ఉంటుంది. ఎన్నిక‌లు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్ర నేత‌లంతా క‌లిసిక‌ట్టుగా ఉండాల్సిన స‌మ‌యం ఇది. కిందిస్థాయి వ‌ర్గాల‌కు సీనియ‌ర్లు దిశానిర్దేశం చేయాల్సి అవ‌స‌రం ఉంది.

కానీ, సీనియ‌ర్లు మాత్రం సీఎం సీటు దిశ‌గానే ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ వచ్చే వారం రాష్ట్రానికి రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై పార్టీలో కొన్ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సీఎం ప‌ద‌వి రేసులో తానే ఉన్నాన‌నీ, తానే అర్హుడ‌న‌నే సంకేతాలు ఇచ్చేందుకు ఉత్త‌మ్ వ్యూహంతో ఉన్న‌ట్టు కాంగ్రెస్ వ‌ర్గాల్లో క‌థ‌నం వినిపిస్తోంది.

ఇటీవల బ‌స్సుయాత్ర‌లో కొన్ని చోట్ల ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఉన్న‌ప్పుడు ‘కాబోయే సీఎం సీఎం’ అంటూ కొన్ని నినాదాలు వినిపించాయట.  సీఎం రేసులో తానే ఉన్నాన‌ని చెప్పుకోవ‌డం కోస‌మే ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆ విధంగా ప్ర‌జ‌ల్లోంచి చెప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నీ, ఆయ‌న ఏర్పాటు చేసిన వారే ఇలాంటి నినాదాలు చేసార‌నే కోణంలో ఈ విషయాన్ని కొందరు ఢిల్లీకి చేరవేసారట. సీఎం సీఎం అన్న‌ప్పుడు క‌నీసం దాన్ని ఖండించ‌డం లాంటివి కూడా ఉత్త‌మ్ చేయ‌లేద‌ని హైకమాండ్ చెవిన వేసార‌ని వినిపిస్తోంది.

రాహుల్ గాంధీ వ‌చ్చే వారంలో రెండ్రోజులు రాష్ట్రంలో జరిగే వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాహుల్ ముందు కూడా అలానే పిలిపించుకుంటారేమో అనే అనుమానం పార్టీ వర్గాల్లో వ్య‌క్త‌మౌతోంది. దీనిపై హైకమాండ్ ఎంత త్వ‌ర‌గా స్ప‌ష్ట‌త ఇస్తే పార్టీకి అంత మంచిది.