గజ్వేల్ కోసమే తెరాసలో చేరారట

396

గజ్వేల్ అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నట్లు వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు తెలంగాణ భవన్ లో ఆయన కేటీఆర్ సమక్షంలో తెరాసా కండువా కప్పుకున్నారు.

పార్టీలోకి రావాలని గతంలో మూడు సార్లు కేటీఆర్‌ కోరారని గతంలోనే తెరాసలో చేరి ఉంటే ఎంతో బాగుండేదని ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యానించారు. గజ్వేల్ నియోజకవర్గంలో వేముల ఘాట్, మల్లన్నసాగర్ ప్రాంతంలోని రైతులు కూడా కేసీఆర్ కు ఓటేసారని ఒంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పోరాటం చేసిసా కేసీఆర్‌పై వ్యక్తిగత ద్వేషం లేదన్నారు.

ఒంటేరు ప్రతాప్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే కార్యక్రమంలో చంద్రబాబుపై విమర్శలు చేసారు కేటీఆర్. కేసీఆర్‌ను ఓడించాలనే కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల కోసం పనిచేస్తుంటే కేసీఆర్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారన్నారు. ఏపీ అభివృద్ధికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా కలిసినా మేజిక్‌మార్క్ రాదన్నారు.

వంటేరు ప్రతాప్ రెడ్డి చేరిక కార్యక్రమానికి ఆయన అనుచరులే పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వంటేరు పార్టీలో చేరడం లేదని ప్రకటించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. హరీష్ రావు కూడా ఎక్కడా కనిపించలేదు. ఆయనకు కనీస సమాచారం కూడా పంపలేదని తెరాస వర్గాలు చెబుతున్నాయి.