ఎన్టీయార్ బయోపిక్ ..గందరగోళంగా వర్మ ఆలోచన

399

వ‌ర్మ మాట‌కే కాదు, చూపుకీ, న‌వ్వుకీ, నిట్టూర్పికీ ఓ భాష ఉంటుంది. ప‌బ్లిసిటీ పెంచుకోవ‌డానికి, ప‌బ్లిక్ ఫిగ‌ర్ల‌ని ప‌బ్లిగ్గా వాడుకోవ‌డంలో మహా నేర్పరి. తాజాగా వ‌ర్మ ఇప్పుడు ఎన్టీఆర్‌పై ప‌డ్డాడు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలో తీస్తాన‌ని చెప్పి త‌న గురించి, త‌న సినిమా గురించీ మాట్లాడుకొనేలా చేసాడు.

ఎన్టీఆర్ క‌థ ఎప్ప‌టికీ గొప్ప క‌మ‌ర్షియ‌ల్ పాయింటే. స్వ‌యంగా ఎన్టీఆర్ వార‌సుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తున్నా స‌రే దానికి స‌మాంత‌రంగా త‌యార‌వుతున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌పైనా ఫ్యాన్స్ దృష్టి పెడ‌తార‌న్న‌ది వాస్త‌వం. అయితే ఎన్టీఆర్ బ‌యోపిక్ విష‌యంలో వ‌ర్మ స్ట్రాట‌జీ గందరగోళంగా ఉంది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అని టైటిలే.. విచిత్రంగా ఉంది. ల‌క్ష్మీ పార్వ‌తీతో మాట్లాడ‌కుండా ఈ క‌థ‌ని ఎలా తెర‌కెక్కిస్తాడు?

ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలో ఎన్టీఆర్ క‌థ చెబుతూ, ల‌క్ష్మీ పార్వ‌తిని ట‌చ్ చేయ‌ను అని చెప్ప‌డం విడ్డూరంగా మారింది. ల‌క్ష్మీ పార్వ‌తినే సంప్ర‌దించ‌ని వ్య‌క్తి బాల‌కృష్ణ‌ని గానీ, హ‌రికృష్ణని గానీ క‌లుస్తాడా.? ఒక‌వేళ వ‌ర్మ‌కు ఆ కోరిక ఉన్నా బాల‌య్య ద‌గ్గ‌ర‌కి రానిస్తాడా.? ఎన్టీఆర్ ఇంట్లో ప‌నిచేసిన డ్రైవ‌ర్ల‌ను, వంట‌వారిని  అడిగి వివ‌రాలు తెలుసుకొంటానని వ‌ర్మ చెప్పినా  అసలైన ఎన్టీఆర్ అంటే ఏమిటో వారికి తెలుస్తుందా? నేను తీసిందే సినిమా, చూపించిందే చ‌రిత్ర‌ అనుకొని అడుగులు వేస్తే మాత్రం ఎన్టీఆర్ బ‌యోపిక్ విష‌యంలో వ‌ర్మ చేతులు కాల్చుకోవ‌డం ఖాయం. జాతి గౌర‌వం అయిన ఎన్టీయార్ విష‌యాల్లో వ‌ర్మ త‌ప్పు చేయ‌డ‌నే ఆశిద్దాం.