రివ్యూ : ‘విధ్వంసం’ ఒక్కటే ఉంది

374

మెగా పవర్‌ స్టార్ రాంచరణ్ హీరోగా తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్‌ ‘వినయ విధేయ రామ’. కమర్షియల్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథేమంటే..

నలుగురు అనాథ‌ల‌కు మరో అనాధ దొరుకుతాడు. రామ (రామ్‌చ‌ర‌ణ్‌) అనే పేరు పెట్టుకుని ఆ న‌లుగురూ ఒక డాక్టరు (చలపతిరావు) సాయంతో ఆ బిడ్డ‌ని పెంచుతారు. వారిలో పెద్ద‌వాడు భువ‌న్ కుమార్ (ప్ర‌శాంత్‌) ఎల‌క్ష‌న్ క‌మీష‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. విశాఖ ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌వేళ పందెం ప‌ర‌శురామ్ (ముఖేష్ రుషి) అరాచ‌కాల్ని అడ్డుకుంటాడు. దాంతో పందెం ప‌ర‌శురామ్ ఈ కుటుంబంపై క‌క్ష్య పెంచుకుంటాడు. భువ‌న్‌కి బీహార్ ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. అక్క‌డ రాజూభాయ్ (వివేక్ ఓబెరాయ్‌) ప్ర‌భుత్వాన్ని త‌న గుప్పెట‌లోకి తీసుకుని, ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. అత‌ని నుంచి అన్న‌య్య‌కు, కుటుంబానికీ ముప్పు ఏర్ప‌డుతుంది. రాజు భాయ్‌, భువన్‌ కుమార్‌ను ఏం చేసాడు.? రాజూభాయ్‌ని ఎదిరించి త‌న కుటుంబాన్ని రామ్ ఎలా కాపాడుకున్నాడు? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

బోయ‌పాటి సినిమాల్లో హీరో బ‌ల‌వంతుడు, విల‌న్ రాక్ష‌సుడు ..వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే పోరులో హీరో విజేత‌గా నిల‌వ‌డం క‌థ‌లు ఇలానే ఉంటాయి. అలానే ఈ సినిమాలో కూడా అడుగ‌డుగునా హీరోయిజం, యాక్ష‌న్‌, అక్క‌డ‌క్క‌డ పాట‌లు, విసుగు అనిపించిన‌ప్పుడు కాస్త కామెడీ ఇలా పేర్చుకుంటూ పోయారు. యాక్ష‌న్ విషయాల విషయంలో బోయ‌పాటి చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించేవాడు. కానీ ఈ సినిమాలో అది మిస్స‌య్యింది. దాంతో ఎక్క‌డిక‌క్క‌డ ముక్క‌లు ముక్క‌లుగా క‌నిపిస్తుంటుంది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌లోనే సినిమాలో చూపించాల్సిన విధ్వంసం అంతా చూపించేసారు. హీరోని వెదుక్కుంటూ బీహార్ నుంచి ఓ ముఖ్య‌మంత్రి వ‌చ్చి బీహార్‌కి మీరు చేసిన సాయం అంతా ఇంతా కాదు అని చేతులు జోడించ‌డం చూస్తే  హీరో బీహార్ వెళ్ళి ఏదో పొడిచి వ‌చ్చాడు అన్నంత బిల్డ‌ప్ క‌నిపిస్తుంది. హీరో ట్రైన్ టాప్‌పై నిల‌బ‌డి ఎలా వ‌చ్చాడో బోయపాటి స్వయంగా చెప్పాలి. హీరో త‌ను వ‌చ్చేంత వ‌ర‌కూ రౌడీ గ్యాంగ్ అంతా మౌనంగా ఓ చోట అలా కూర్చోవ‌డం ఏంటో అర్థం కాదు. అంత వ‌ర‌కూ వంద‌ల వేల సైన్యంతో ఊర్ల‌మీద ప‌డి చెల‌రేగిపోయే రాజూ భాయ్‌ హీరో క‌నిపించ‌గానే ఒంట‌రైపోతాడు. ఎమోష‌న్ మిస్స‌యితే తెర‌పై హీరోయిజం కూడా నవ్వు తెప్పిస్తుందని ఈ సినిమా చూస్తేనే అర్థ‌మ‌వుతుంది.

ఎవరెలా..

రామ్‌ చరణ్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. రామ పాత్రలో ఒదిగిపోయాడు. నటుడిగానూ పరిణతి కనిపించింది. ముఖ్యంగా యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో చరణ్‌ నటన ఆకట్టుకుంటుంది. కియారా అద్వానీ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. పెద్దగా నటనకు ఆస్కారం లేదు. ప్రశాంత్, స్నేహ హుందాగా కనిపించారు. విలన్‌గా వివేక్‌ ఒబెరాయ్‌ ఆకట్టుకున్నాడు. ఆర్యన్‌ రాజేష్‌, ముఖేష్‌ రుషి, హరీష్ ఉత్తమన్‌, రవి వర్మ, మధునందన్‌ లాంటి నటులకు రెండు మూడు డైలాగులకు మించి లేవు.

ఫైనల్ గా..

వినయ, విదేయతలు సంగతి పక్కన పెడితే ‘విధ్వంసం’ మాత్రం బోలెడు.