భగవంతుడు అనీషాను నాకోసం పంపారు

1443

నటుడు విశాల్‌ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త దినేశ్‌రెడ్డి, సరిత దంపతుల కూతురు అనీషా అల్లారెడ్డిని పెళ్ళాడబోతున్న విషయాన్ని బహిరంగంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ నేపధయ్మ్లో ఈ జంట వివాహం గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి అయిన అనీషారెడ్డి తెలుగులో అర్జున్‌రెడ్డి, పెళ్ళిచూపులు వంటి చిత్రాల్లో నటించారు. అనీషాతో పరిచయం ఎలా ప్రేమగా మారింది అన్న విషయాలను నటుడు విశాల్‌ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

‘నేను గత ఏడాది అక్టోబర్‌లో విశాఖపట్టణంలో జరిగిన అయోగ్య చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నాను. అప్పుడు ఆ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటున్న మహిళలు మాత్రమే నటిస్తున్న అంగ్ల చిత్ర యూనిట్‌ను కలిసాను. ఆ చిత్రంలో అనీషా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎక్కువ మంది వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు నటించడం చూసి ఆకర్షితుడినై ఆ చిత్ర నిర్మాణాన్ని నేనే చేపట్టాను. అప్పటి నుంచి ఆ చిత్రానికి సంబంధించిన వ్యవహారాల గురించి తరచూ అనీషాను కలుసుకునేవాడిని. ఆ పరిచయమే పెళ్ళికి దారి తీసింది. భగవంతుడు ఆమెను నాకోసం పంపారు. అనీషాతో ముందుగా నేనే ప్రేమను వ్యక్తం చేసాను. వివాహనంతరం అనీషాను నటించవద్దని చెప్పను. ఆమెకు ఏది ఇష్టమో అది చేయవచ్చు.

అనీషా పులికి శిక్షణ ఇస్తున్న వీడియోను చూశాను. అందులో పులికి శిక్షణ ఇచ్చి నిద్రపుచ్చడం చూసాను. నేను మృగాలతో ఒక చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాను. దానికి అనీషా తోడ్పాటును కోరతాను. అన్నీ సక్రమంగా ఉంటే ఈ ఏడాదే ఆ చిత్రాన్ని రూపొందిస్తాను. ఆ చిత్రంలో అనీషా పాల్గొంటారు. కొత్తగా నిర్మిస్తున్న నడిగర్‌సంఘం భవనంలోనే ఇద్దరం పెళ్ళి చేసుకోబోతున్నాం’ అని పేర్కొన్నాడు.