ప్రతిపక్షం ఏం చేసిందో కూడా చెప్పాలిగా

120
ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి విమ‌ర్శిస్తూనే ఉంటారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం తాము పాద‌యాత్ర‌లు, యువ‌భేరి కార్య‌క్ర‌మాలు, బంద్ లు నిర్వ‌హిస్తుంటే దెబ్బ త‌గిలిన చోట కారం చ‌ల్లుతారా అని చంద్ర‌బాబు విమ‌ర్శించార‌న్నారు. ప్ర‌త్యేక హోదాను చంద్ర‌బాబు అమ్మేసుకున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రానికి ఏదో అన్యాయం జ‌రిగిపోతోంద‌ని తెలిసిన‌ట్టు చంద్ర‌బాబు మొస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌న్నారు. ఇలాంటి రాజ‌కీయాలు చూసిన‌ప్పుడు ఎందుకు ఈ దిక్కుమాలిన రాజ‌కీయాలు చేయాలీ, ఆ ప‌ద‌వికి రాజీనామా చేసి ఇంటికెళ్ళి ఆనందంగా కూర్చుంటే మేలు క‌దా అని త‌న‌కనిపిస్తుంద‌ని జ‌గ‌న్ చెప్పారు. ఆ త‌రువాత‌, చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల గురించి ఎద్దేవా చేస్తూ సినిమాలో విల‌నూ,13 రీళ్ళ వ‌ర‌కూ హీరో క‌ష్టాలు, చివ‌రిగా హీరో గెల‌వ‌డం ఈ క‌థ మళ్ళీ చెప్పారు.
రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో అధికార పార్టీ బాధ్య‌త‌ను ఇన్నిసార్లు ప్ర‌శ్నిస్తున్న జ‌గ‌న్‌ కు ప్ర‌తిప‌క్షంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో బాధ్య‌త ఉంటుంది క‌దా. ప్ర‌త్యేక హోదాను చంద్ర‌బాబు అమ్మేసుకున్నార‌ని అంటున్నారు, మ‌రి దాని కోసం వైకాపా ఏం చేసింది..? ఎంపీలు రాజానామాలు చేసేస్తార‌ని చెప్పిన ఆయనే తరువాత మేం రాజీనామా చేస్తే పార్ల‌మెంటులో మాట్లాడేవారు ఉండ‌ర‌న్నారు.  బ‌డ్జెట్ కేటాయింపుల విష‌యంలో కేంద్రం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తే వెంట‌నే ఎందుకు రాజీనామాలు చేయ‌లేకోపోయారు?
తెదేపా ఎంపీలూ, కేంద్ర‌మంత్రి వ‌ర్గంలోని తెదేపా నేత‌లు కూడా భాజ‌పాపై విమ‌ర్శ‌ల‌కు దిగిన సందర్భంలో వైకాపా మ‌ద్ద‌తు ఇవ్వాలి కదా.? ఆ భాద్యత ప్ర‌తిప‌క్షానికి లేదా.? ఈ స‌మ‌యంలో ఆర్టిక‌ల్ సో అండ్ సో ప్ర‌కారం క్యాబినెట్ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించాలంటే రాజీనామా చేయాలని లా పాయింట్లు తీసి రాష్ట్రప‌తికి ఫిర్యాదు చేయ‌డాన్ని ఏమ‌నుకోవాలి..? అంత‌కుముందు, పోల‌వ‌రం విష‌యంలోనూ ఇదే ధోర‌ణి. టెండ‌ర్ల విష‌య‌మై కేంద్రం మోకాల‌డ్డే ప్ర‌య‌త్నం చేస్తే ఆ స‌మ‌యంలో వేరే ర‌కంగా ఫిర్యాదులు చేశారు. పోల‌వ‌రం నిర్మాణ బాధ్య‌త‌ల నుంచి చంద్ర‌బాబును త‌ప్పించేయండని కోరారు. అమ‌రావ‌తికి కేంద్రం నిధులు ఇవ్వ‌డం లేదంటే క‌మిష‌న్ల కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ఆరోపించారు.
వైకాపా ఇన్నాళ్ళుగా అధికార పార్టీ చేసే ప్ర‌తీ ప‌నిలోనూ లేని అవినీతి కోణాన్ని వెత‌క‌డం, లేదా ప్ర‌తి ప‌ని వెన‌కా ఎవ‌రివో వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ఉన్నాయేమో అనే అంటోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను చంద్ర‌బాబు అమ్ముకున్నార‌ని గాట్టిగా విమ‌ర్శిస్తున్న‌ప్పుడు ఆ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌తిప‌క్షం చేసిన ప్ర‌య‌త్నం కూడా కనిపించాలిగా. పాద‌యాత్రలో చెప్పిందే చెప్తున్నారే గానీ ..తామేం చేసారు నాలుగేళ్ళుగా అనేదే చెప్పట్లేదు.