భాజపాతో పొత్తుపై తెదేపా క్లారిటీ ఏమంటే..

105

భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తుపై తెదేపా శ్రేణుల్లో చ‌ర్చ జ‌రుగుతోంద‌నీ క‌థ‌నాలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే భాజ‌పాతో పొత్తు చ‌ర్చ ఎప్పుడు మొద‌లైనా ప్ర‌స్తుతానికి విమ‌ర్శలొద్దు, ఎన్నిక‌ల‌ప్పుడు చూద్దామని అధినేత చెపుతూ వస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో భాజ‌పా విష‌య‌మై ఇప్ప‌టికీ గంద‌ర‌గోళ ప‌రిస్థితే ఉంది. తాజాగా చంద్రబాబు పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశంలో ఈ అంశంపై స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేసార‌ట‌.

భాజ‌పా స్నేహ ధ‌ర్మం పాటించ‌డం లేదని, ప‌ద‌వుల విష‌యంలో తెదేపాని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వెలిబుచ్చారట. భాజ‌పాకి ఆంధ్రా నుంచి రాజ్య‌స‌భ సీటు, మంత్రి వ‌ర్గంలో చోటు, నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తున్నా ఒక గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి అడిగితే దానిపై కేంద్రం సానుకూలంగా స్పందించ‌లేద‌ని పార్టీ నేత‌ల ముందు అసంతృప్తి వ్య‌క్తం చేసారట‌. రాష్ట్ర అభివృద్ధి విష‌యంలో కేంద్ర సాయం స‌రిగా లేద‌నీ, అయినా రాజీప‌డ‌కుండా సొంతంగానే స‌మ‌స్య‌ల్ని అధిగ‌మిస్తున్నామ‌న్నార‌ట‌.

చంద్ర‌బాబు చెప్పింది విన్నాక రాబోయే ఎన్నికల్లో భాజ‌పాతో పొత్తు ఉండ‌బోద‌ని చెబుతున్న‌ట్టేగా అని పార్టీ నేత‌లు ఫిక్స్ కాబోతున్న త‌రుణంలో మ‌రో ట్విస్ట్ ఇచ్చార‌ట‌. భాజ‌పా వైఖ‌రి ఎలా ఉన్నా వారితో పోరాడుతూ స‌మ‌యం వృధా చేసుకోలేం క‌దా అని అన్నార‌ట‌. దీంతో కొంత‌మంది సీనియ‌ర్ నేత‌లు ఏమంటున్నారంటే, చంద్ర‌బాబు చెప్పారు కాబ‌ట్టి, కేంద్రంపై విమ‌ర్శ‌లు చేయ‌డం లేద‌నీ చెబుతున్నారు. మ‌రో వాద‌న ఏంటంటే భాజ‌పాతో స్నేహన్ని వదులుకుంటే ఆ పార్టీతో చేతులు క‌లిపేందుకు వైకాపా సిద్ధంగా ఉంద‌నీ, ఆ అవ‌కాశం వారికి ఇవ్వ‌కూడ‌ద‌న్న‌దే త‌మ ధ్యేయం అని చెబుతున్నారు.

ఏతా వాతా అర్ధమైంది ఏమంటే భాజ‌పా విష‌య‌మై చంద్రబాబు ఇచ్చిన క్లారిటీ ఏమంటే భాజ‌పాతో దోస్తీ కొన‌సాగుతుంది అనే క‌దా! చంద్ర‌బాబుకి భాజ‌పా తీరుపై అసంతృప్తి ఉన్నపుడు విడిపోయి ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పొచ్చుగా, ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఏంటి.?