నంద్యాల ఫలితం తర్వాత ఎమ్మెల్యే ‘రోజా’ ఎక్కడ .?

457

వైకాపా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజాపై మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పుమన్నాయి. ఆమె నిత్యం ఏదో ఒక టాపిక్ తో మీడియాలో ఉంటారు. అలాంటి రోజా ఇప్పుడు వార్త‌ల్లో క‌నిపించ‌డం లేదు. న‌ంద్యాల ఫ‌లితం త‌రువాత ఆమె స్పందించ‌లేదు. ప్ర‌ముఖ వైకాపా నేత‌లంతా ఓట‌మి గురించి మాట్లాడ‌కుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామాల‌కు డిమాండ్ చేస్తుంటే, రోజా మాత్రం మౌనంగా ఉన్నారు. నంద్యాల ఫ‌లితంపై సోష‌ల్ మీడియాలో ఒక పోస్టు పెట్టేసి, మ‌మ అనిపించారు.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం వైకాపా శ్రేణుల్లో ఎమ్మెల్యే రోజాపై చ‌ర్చ జ‌రుగుతోంద‌ని స‌మాచారం. నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆమె చేసిన విమ‌ర్శ‌లు తెదేపా మెజారిటీ పెంచ‌డానికి కార‌ణ‌మ‌య్యాయనే అభిప్రాయాలు వైకాపా వ‌ర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయ‌ట‌. మంత్రి భూమా అఖిల ప్రియ‌పై ఆమె చేసిన కామెంట్లు వైకాపాకి వ్య‌తిరేకంగా పనిచేసాయ‌ని అంటున్నార‌ట‌. తెలుగువారి ఆత్మ‌గౌర‌వం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారనీ, అలాంటి పార్టీలో మంత్రిగా ఉంటూ చీరా బొట్టు పెట్టుకోకుండా, మ‌గాడిలా చుడీదార్ వేసుకుని వెళ్ళే అఖిల ప్రియ సంప్ర‌దాయాల గురించి మాట్లాడ‌టం ఏంట‌ని రోజా ఎద్దేవా చేసిన సంగ‌తి తెలిసిందే.

మరోవైపు, సోష‌ల్ మీడియాలో రోజా చేసిన ఛాలెంజ్ పై చాలా అభిప్రాయాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక‌లో తెదేపా ఓడిపోతే గుండు కొట్టించుకుంటా అంటూ ఆమె చేసిన స‌వాలు వివాదానికి కార‌ణ‌మైంది. ప‌శ్చిమగోదావ‌రి జిల్లా జంగారెడ్డి గూడెంలో రోజాకు గుండు కొట్టించిన‌ట్టు ఉండే ఫ్లెక్సీ ద‌ర్శ‌న‌మిచ్చింది. దీంతో అక్క‌డ వైకాపా కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన‌వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా నంద్యాలలో వైకాపా ఓట‌మికి రోజా అతి విమ‌ర్శ‌లే కార‌ణం అని కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు.