రూ.110 కోట్ల ‘అమ్మ’ ఆస్తులు ఎవరికి.?

511

నంబర్‌ 81, వేదా నిలయం, పోయెస్ గార్డెన్‌, చెన్నై.

అమ్మను ఆరాధించే సాధరణ అభిమాని నుండి రాజకీయ నేతల్ వరకూ తమిళనాడులో ఈ చిరునామా తెలియని వారుండరు. దాదాపు పాతికేళ్లు తమిళనాడులో అసలైన రాజకీయాలకు ఇక్కడినుండే అంకురార్పణ జరిగింది.1967లో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మాతృమూర్తి సంధ్య రూ.1.32లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఈ ఆస్తిని తన అస్తిత్వంగా మార్చుకున్నారు పురచ్చి తలైవి. పోయెస్ గార్డెన్‌ అనగానే బలమైన రాజకీయ శక్తికి నిలయం అనే గుర్తింపును తెచ్చారు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అంచనా ప్రకారం పోయెస్ గార్డెన్ విలువ దాదాపు రూ.90కోట్లపై మాట.

జయలలిత అస్తమయం అనంతర పరిస్థితులు సర్దుమణిగేలా చేసేందుకు పార్టీ పగ్గాలు జయ ప్రాణ స్నేహితురాలు శశికళకు, ముఖ్యమంత్రి పదవి జయ విశ్వసనీయుడైన పన్నీర్‌ సెల్వం చేతికి వచ్చాయి. అయితే, అమ్మ ఆస్తులకు ఎవరు వారసులుగా ప్రకటించబడతారనే విషయం పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో ఏనాడు తన తర్వాత ఎవరూ అనే విషయాన్ని ప్రకటించకపోవటమే ఎప్పుడూ ఒక వీలునామా అంటూ రాయకపోవటమే ప్రశ్నగా మారింది.

దీంతో ఇప్పుడు ఆ ఆస్తులు ఎవరికి చెందుతాయనే అంశం తెరమీదికొచ్చింది.

జయ స్నేహితురాలు శశికళ నటరాజన్‑కు వేదా నిలయంలో శాశ్వతంగా ఉండే హక్కు వస్తుందా లేక ఆమె మేనకోడలు దీపా జయకుమార్‌, మేనల్లుడు దీపక్‌ లకు వస్తుందా అనేది ప్రధానమైన ప్రశ్న. (ఒక సందర్భంలో ఆ ఆస్తిని జయలలిత తల్లి గారు తనకు రాసిచ్చారని దీప చెప్పింది కూడా.) ఇవేమీ కాక ఎంజీఆర్ ఆస్తుల లానే చట్టపరమైన వివాదాల్లో చిక్కి ఎవరికీ దక్కనట్లుగానే ఉండిపోతుందా అనేది మరో ప్రశ్న.

జయలలిత అంతిమ సంస్కారాలను పూర్తి చేసిన శశికళ అనంతరం నేరుగా వేద నిలయానికి వెళ్ళారు. ఇప్పటికే మేనత్త అంతిమ సంస్కారాలను శశికళ నిర్వహించటమేమిటని కారాలు నూరుతున్న దీప ‘పోయెస్ గార్డెన్’ విషయంలో ఎటువంటి మిరియాలు నూరనున్నారో మరి.