రేవంత్ రెడ్డి వద్ద ఏమీ లేవట.?

147

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడుల్లో ఏమి దొరికాయన్న విషయం అధికారంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించలేదు. పెద్దమొత్తంలో ఆస్తులు దొరికితే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉండేవారు.

కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా మీడియాలో మాత్రం అమెరికా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్‌లలో అక్రమాస్తులంటూ హోరెత్తించారు. కానీ రేవంత్ రెడ్డి ఇంట్లో ఒక్క రూపాయి కూడా అదనపు సొమ్ము దొరకలేదు. రేవంత్ సమీప బంధువు కేఎల్ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కోటి నలభై లక్షలు మాత్రం స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ ఇంట్లో రూ కోటి డిపాజిట్లకు సంబంధించిన బ్యాంక్ డీటైల్స్‌ మాత్రం తెలుసుకున్నారు.

రేవంత్ రెడ్డికి ఒక్క విదేశీ బ్యాంక్ అకౌంట్ కూడా లేదని ఐటీ అధికారులు వివరణ అడిగిన సమయాల్లో తాను ఆయాదేశాలకు వెళ్ళలేదని కావాలంటే ఇమ్మిగ్రేషన్ దగ్గర్నుంచి సమాచారం తెప్పించుకోవచ్చని రేవంత్ వారికి నేరుగానే సమాధానం చెప్పారు. ఇంట్లో జరిగిన సోదాల్లో కానీ కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌ల నుంచి కానీ.. విదేశీ ఖాతాలకు సంబంధించిన సమాచారం దొరకలేదు. దాంతో వారు రేవంత్ ఖాతాలన్ని చెప్పబడుతున్న విదేశీ బ్యాంకులకు లేఖలు రాసి సమాచారం తెప్పించుకోవాలని నిర్ణయించారు.

రేవంత్ రెడ్డి ఇంట్లో దొరికిన వాటితో చిన్న కేసు కూడా పెట్టలేమని ఐటీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఓటుకు నోటు కేసు విషయాన్ని ఐటీ అధికారులు పదే పదే రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. ఎన్ని సార్లు అడిగినా కుట్ర కేసు అని మాత్రమే రేవంత్ రెడ్డి చెప్పారు. మూడో తేదీన రేవంత్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. నిజానికి మూడు రోజుల పాటు రాష్ట్రానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తికి సంబంధించిన ఆస్తులపై సోదాలు చేసి ఏమీ లేవని చెబితే ఎవరు మాత్రం ఏం చేయగలరు.