జగన్ ఆస్తులను స్వాధీనం చేస్తారా.!

61

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలి కాలంలో వైసీపీ అధినేత జగన్ ఆస్తులు ఎందుకు వేలం వేయరని ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రజాసంపదను దోచుకున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా సన్నాహాలు ప్రారంభించారు.

తాజాగా ‘స్పెషల్‌ కోర్టు యాక్ట్‌-2016’ను ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చింది. దీని ప్రకారం అవినీతి, అక్రమాలకు పాల్పడి సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ చట్టాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌ అవినీతి నిరోధక శాఖ తొలి కేసు నమోదు చేసింది. ఆరు నెలల కిందట భారీ ఆస్తులతో ఏసీబీకి చిక్కిన సర్వే ఇన్‌స్పెక్టర్‌ జీఎల్‌ గణేశ్వరరావుపై తొలి కేసు నమోదు చేసారు. దాడుల్లో బయటపడిన గణేశ్వరరావు ఆస్తులన్నింటినీ ఏసీబీ అధికారులు సీజ్‌ చేసి కోర్టు ద్వారా ప్రభుత్వానికి స్వాధీనం చేస్తారు.

ఇప్పటి వరకు అవినీతి కేసుల్లో పట్టుబడినా అధికారులు మాత్రం అక్రమంగా సంపాదించిన ఆస్తులను అనుభవిస్తూనే ఉండేవారు. ఇక ముందు ఆ అవకాశం లేదు. ‘స్పెషల్‌ కోర్టు యాక్ట్‌-2016’ కింద కేసు నమోదు చేస్తే ఆస్తి నెల రోజుల్లోగా ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. చరాస్తులు కోర్టులో డిపాజిట్‌ చేస్తే, స్థిరాస్తులపై వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వానికే. కేసు రుజువైతే ఆస్తి శాశ్వతంగా ప్రభుత్వానికి చెందుతుంది. ఒకవేళ వీగిపోతే మాత్రం ఐదు శాతం వడ్డీతో ఆస్తులను అప్పగిస్తారు.

ప్రస్తుతం జగన్‌కు చెందిన అనేక ఆస్తులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్ అటాచ్‌లో ఉన్నాయి. కొత్తగా తెచ్చిన చట్టం సాయంతో ఏపీలో కేంద్రం దర్యాప్తు సంస్థలు జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. అయితే ఇదంత    సులభం కాదు. కొద్ది రోజుల కిందట ఈడీ అటాచ్ చేసిన రెండు ఆస్తులను కూడా కేంద్రం సీక్రెట్‌గా రిలీజ్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కష్టమేనన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉంది.