కుకునూరుపల్లి పోలీసుస్టేషన్‌కు చెందిన ఎస్ఐ ప్రభాకరరెడ్డి ఆత్మహత్యపై ఇంతవరకూ పోలీసుల నుంచి సంతృప్తికరమైన వివరణ గాని వివరాలు గాని వెల్లడి కాలేదు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి శిరీష ఆత్మహత్య చేసుకుందని సుదీర్ఘ నివేదిక ఇచ్చారు గాని ఎస్ఐ మరణం గురించి మాత్రం పోలీసులు నోరు మెదపడం లేదు. పైగా ప్రభాకరరెడ్డికి సంబంధించిన వీడియో ఫుటేజి అడిగితే సిద్దిపేట కమిషనరేట్ సాంకేతిక సమస్యలు వచ్చాయని ఒకటికి రెండు సార్లు నిస్సహాయత వ్యక్తం చేసిందట. మరి ప్రభాకరరెడ్డితో ఈ శిరీష, రాజీవ్, శ్రవణ్ సమావేశం ఇతర విషయాలు సిసిటివి నమోదు చేసిన దాన్నిబట్టి తెలుసుకోవలసి వుంటుంది.
ఇదే స్టేషన్లో గత ఆగష్టులో రామకృష్ణారెడ్డి అనే మరో ఎస్ఐ కూడా ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. యాలాల ఎస్ఐ రమేష్, దుబ్బాక ఎస్ఐ చిట్టిబాబు కూడా ఆత్మహత్యల చేసుకున్నట్టు కథనాలు వచ్చాయి. 2016 నవంబరులో శ్రీధర్ అనే మరో ఎస్ఐ మల్లారెడ్డిపల్లెలోని ఒక అపార్ట్మెంట్లో ఇలాగే చనిపోయాడు. తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన కానిస్టేబుల్ పి.విజయకుమార్ కూడా అదే నెలలో కొండాపూర్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన కృష్ణపల్లిమధు అనే కానిస్టేబుల్ చాంద్రాయణగుట్టలో తమ క్యాంపు ఆఫీసు దగ్గర్లో విషం మింగి మరణించినట్టు నమోదైంది. ఇలా మొత్తం పదిమంది పోలీసులు అధికారులు ప్రాణాలు తీసుకున్నా ప్రభుత్వం గాని పోలీసు శాఖ గాని మామూలు విషయంగానే తీసేస్తున్నారు.
చనిపోయిన వారు వేధింపుల వల్లనే బలయ్యారని కుటుంబ సభ్యులు అంటే ఏవో కుటుంబ కలహాలు వివాహేతర సంబంధాలు కారణమని పోలీసులు కేసు మూసేస్తారు. ఇలా మొత్తం పదిమంది వరకూ మరణించారు.ఇప్పుడు ప్రభాకరరెడ్డి హత్య కూడా అదే తరహాలో నడుస్తున్నది. శిరీష మరణంపై ఇచ్చిన వివరాలలో సగమైనా ఎస్ఐ గురించి చెప్పడం లేదు. పైగా నిందితులైన శ్రవణ్, రాజీవ్ ఇచ్చిన వాంగ్మూలమే ఇందుకు ఆధారంగా తీసుకున్నారు. ఈ క్రమంలో వస్తున్న సాంకేతిక సందేహాలకు ఏవో సమాధానాలిచ్చి సరిపెట్టే ప్రక్రియ జరుగుతోంది.