ఉన్నట్లుండి ‘టీ-కాంగ్రెస్’ తెరపైకి విజయశాంతి

148

విజ‌య‌శాంతి కొంతకాలంగా క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కొన్నాళ్ళ ముందరే తెరాసను విడిచిపెట్టి కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చురుగ్గా పనిచేయకపోయినా ప్ర‌స్తుతం ఆమె కాంగ్రెస్ లోనే ఉన్నారు. కేసీఆర్ స‌ర్కారుపై పోరాటాల్లోగానీ, పార్టీ త‌ర‌ఫున జ‌రిగే ఎలాంటి నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో గానీ పాల్గొనలేదు. దాంతో కాంగ్రెస్ నేత‌లు కూడా ఆమెని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీంతో ఓ ద‌శ‌లో ఆమె పార్టీ మార‌తారేమో అనే ఊహాగానాలు కూడా వినిపించాయి.

అయితే, త్వ‌ర‌లో ఆమెకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్య‌త పెంచే అవ‌కాశాలు ఉన్న‌ట్టుగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో గిల్లికజ్జాలను అధిగ‌మించి 2019 ఎన్నిక‌లలో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ధ్యేయంగా అధిష్టానం ఉంది. ఈ నేపధ్యంలో విజ‌య‌శాంతికి ప్రాధాన్య‌త పెంచనున్నారట. విజ‌య‌శాంతికి ఉన్న సినీ గ్లామ‌ర్ పార్టీకి ఎంతో కొంత ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే ఆలోచ‌న‌లో పార్టీ ఉంద‌ట‌. పీసీసీ ప్ర‌చార క‌మిటీ బాధ్య‌త‌లు ఆమెకి అప్ప‌గించాల‌నే ప్ర‌తిపాద‌న తెర‌మీదికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

ఇలాంటి క‌థ‌నాలు తెర‌పైకి రావ‌డంతో కొంతమంది కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నార‌ట‌. విజ‌య‌శాంతిని బ‌తిమాలి మ‌రీ తీసుకుని రావ‌డం అవ‌స‌ర‌మా అని కొంద‌రు సీనియర్లు వాపోతున్న‌ట్టు తెలుస్తోంది. గ‌డ‌చిన మూడేళ్ళలో ఆమె ఏం చేసారని చర్చించుకుంటున్నారట. ఏదేమైనా ఉన్న‌ట్టుండి విజయశాంతికి ప్రాధాన్యం పెంచేస్తే మ‌రో స‌మ‌స్యగా మారుతుందనటంలో సందేహం లేదు.