హరిబాబు ఇంకా అదే చెపుతున్నారు..

110
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి కేంద్రం ఇచ్చిన హామీల్లో 85 శాతం పూర్త‌య్యాయ‌ని ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు చెప్పారు. కేవ‌లం 15 శాతం మాత్ర‌మే మిగిలి ఉన్నాయ‌నీ, వాటిని ఎన్నిక‌లు వ‌చ్చేలోగా పూర్తిచేయ‌డానికి పార్టీ క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఇన్ని ప‌నులు చేసిన‌ప్ప‌టికీ, ఆంధ్రాకి భాజ‌పా ఏమీ చేయ‌లేద‌నీ, అన్యాయం చేసింద‌నీ మోసం చేసింద‌నీ కొంత‌మంది మాట్లాడటం బాధాక‌ర‌మైన విష‌య‌మ‌ని హ‌రిబాబు ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఆంధ్రా క‌లిసి ఉండ‌గా ఈ ప్రాంతంలో జాతీయ ప్రాముఖ్య‌త క‌లిగిన ఒక్క విద్యా సంస్థ కూడా లేద‌న్నారు. కేవ‌లం మూడున్నర సంవ‌త్స‌రాల్లో 9 సంస్థ‌లు భాజ‌పా ఏర్పాటు చేసింద‌న్నారు. గ‌డ‌చిన 50 సంవ‌త్స‌రాల్లో లేని విద్యా సంస్థ‌లు ఇప్పుడు ఏపీలో ప‌నిచేస్తున్నాయ‌న్నారు.
ఏపీకి ఇచ్చిన హామీల‌ను చిత్త‌శుద్ధితో నెర‌వేర్చుతాం అన‌డానికి ఇదే నిద‌ర్శ‌నమ‌ని చెప్పారు. పెండింగ్ లో ఉన్న ఓడరేవు నిర్మాణం, క‌డ‌ప స్టీల్ ప్లాంట్‌, రైల్వేజోన్‌, పెట్రోలియం కాంప్లెక్స్ ఇవి ఇంకా ముందుకెళ్లాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. రానున్న రోజుల్లో ఈ విష‌యాల్లోనూ సానుకూలంగా కేంద్రం ముందుకెళ్తుంద‌న్నారు. రైల్వేజోన్ పై ఇతర రాష్ట్రాల‌ను ఒప్పించి, విశాఖ జోన్ ఏర్పాటు ప్ర‌య‌త్నం ప్రారంభ‌మైంద‌న్నారు. కేంద్ర రైల్వే శాఖ క‌స‌ర‌త్తు చేస్తోంద‌నీ, త్వ‌ర‌లోనే సానుకూల నిర్ణ‌యం వ‌స్తుంద‌న్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విష‌యంలో కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు. వీటితోపాటుగా చ‌ట్టంలో చెప్ప‌ని అనేక సంస్థ‌ల్ని కేంద్రం ఇచ్చింద‌న్నారు.
న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలో గ‌డ‌చిన మూడున్న‌రేళ్ళలో ఏపీలో జ‌రిగిన అభివృద్ది, గ‌త 40 ఏళ్ళలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని హ‌రిబాబు అన్నారు. స్వ‌తంత్రం త‌రువాత ఏ కేంద్ర ప్ర‌భుత్వ‌మూ ఏ రాష్ట్రానికీ ఇవ్వ‌నంత సాయాన్ని మోడీ స‌ర్కారు ఆంధ్రాకి ఇచ్చింద‌న్నారు. 85 శాతం చేసేసామ‌న్నారు. కానీ, కేవ‌లం కొన్ని విద్యా సంస్థ‌ల గురించే మాట్లాడుతున్నారు. వారు గొప్ప‌గా చెప్పుకుంటున్న స‌ద‌రు సంస్థ‌ల‌కు తాజా బ‌డ్జెట్ లో కేటాయించిన సొమ్ము గురించి హ‌రిబాబు ఎందుకు మాట్లాడ‌రు.?
రైల్వేజోన్ ప‌రిశీల‌న‌లో ఉంది, ఆర్థిక లోటు లెక్కింపుపై క‌స‌ర‌త్తు జ‌రుగుతోందీ, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప‌రిశీలిస్తున్నాం వగైరా వగైరా నాలుగేళ్ళ  త‌రువాత చెప్పాల్సిన క‌బుర్లా ఇవి.? మ‌రి, హ‌రిబాబు గొప్ప‌గా చెప్పుకుంటున్న 85 శాతం ఏ లెక్క‌న పూర్త‌యిన‌ట్టు.? అంటే, అర‌కొర నిధుల‌తో ప్రారంభించేసిన ఆ తొమ్మిది విద్యా సంస్థ‌ల్నే కేంద్రం ఇచ్చి హామీల్లో పూర్తయిన ఎన‌భై ఐదు శాతంగా చెబుతున్నారా?