ఓటమిని ఇలా కూడా విశ్లేషించవచ్చు.!

443

నంద్యాల ఫ‌లితంపై వైకాపాలో స‌రైన విశ్లేష‌ణ జ‌రిగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. భావోద్వేగాల కోణం నుంచే నంద్యాల ప్ర‌జ‌ల తీర్పును చూస్తున్న‌ట్టున్నారు. నంద్యాల‌లో పనిచేసిన కార్యకర్తలకు జ‌గ‌న్ ధన్యవాదాలు చెప్పారు. కానీ, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌర‌విస్తున్న‌ట్టుగా ఒక్క‌ మాట కూడా చెప్ప‌లేదు. 2019 మ‌హా కురుక్షేత్రానికి నంద్యాల నాంది అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసారు. కానీ, ఇప్పుడా మాట మార్చేస్తూ ఇది రెఫ‌రెండ‌మ్ ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు.

నంద్యాల‌లో తెదేపా విజయం సాధించిందనేది మూర్ఖ‌త్వం అవుతుందని అన్నారు. దాదాపుగా రూ.200 కోట్లు ఖర్చు చేసి తెదేపా గెలిచిందన్నారు. ఓట‌ర్ల ఇంటికి వెళ్ళి భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసి, తెదేపాకి ఓటెయ్య‌క‌పోతే పెన్ష‌న్లు ఆగిపోతాయ‌నీ, రేష‌న్లు రాకుండా పోతాయ‌ని బెదిరించార‌న్నారు. పెద్ద ఎత్తున పోలీసుల‌ను వాడుకున్నార‌నీ, అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌న్నారు. ఇప్పుడు చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఓటేసినా, ఆయ‌న వెంట‌నే అధికారంలోంచి త‌ప్పుకునే ప‌రిస్థితి ఉండ‌దని ఓట‌ర్లు భావించార‌నీ, భ‌య‌ప‌డుతూ ఆయ‌న‌కి ఓట్లేసారు కాబ‌ట్టే గెలిచార‌ని విశ్లేషించారు.

రెఫ‌రెండ‌మ్ గురించి మాట్లాడుతూ ఒకే ఒక్క‌చోట ఎన్నిక జ‌రిపితే అది రెఫ‌రెండ‌మ్ ఎలా అవుతుంద‌న్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలంద‌రితోనూ రాజీనామా చేయించి, ఒకేసారి ఎన్నిక‌ల‌కు వ‌స్తే అది రెఫ‌రెండ‌మ్ అవుతుంద‌ని చెప్పారు. తాము విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేసామ‌నీ, వైకాపాలో వ‌చ్చిన‌వారు రాజీనామా చేసి రావాల‌నే నియ‌మాన్ని పాటించామ‌న్నారు. నంద్యాల ఫ‌లితాల‌ను చంద్రబాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న కోణం నుంచే జ‌గ‌న్ విశ్లేషించుకుంటున్నారు. అంతేగానీ, వైకాపా శ్రేణుల లోపాలు, జ‌గ‌న్ స్వయంకృతాల గురించి ఆలోచించ‌డం లేన‌ట్టుగా ఉంది. నిజానికి, నంద్యాల ఎన్నిక‌ల‌ను సెమీ ఫైన‌ల్స్ అని చెప్పిందే జ‌గ‌న్‌! ఉప ఎన్నిక వేడిని పెంచింది వారే. ఇప్పుడా మాట మార్చేసి కొత్త భాష్యం చెబుతున్నారు.