చై-సామ్ వివాహ విందులో ‘తళుకులు’ లేవెందుకో.!

113

ఎప్పుడెప్పుడా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూసిన అక్కినేని నాగ చైతన్య, కథానాయిక సమంతల వివాహ విందు వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్‌.కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ, మీడియా ప్రముఖులు ఈ వేడుకకి హాజరై కొత్త జంటకి శుభాకాంక్షలు చెప్పారు. అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులు అతిథుల్ని సాదరంగా ఆహ్వానించారు. చైతూ, సమంతల పెళ్ళి అక్టోబరు 6,7 తేదీల్లో గోవాలోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలోని సన్నిహితుల మధ్య అట్టహాసంగా జరిగింది.

ఈ వివాహ విందు వేడుక అక్కినేని నాగార్జున ఆధ్వర్యంలో జరిగింది. మీడియాకు ప్ర‌త్యేకంగా ఆహ్వానాలు రావ‌డం, ఈ విందులో పాత్రికేయుల‌కు కాస్త ప్ర‌త్యేక స్థానం క‌ల్పించ‌డం నాగ్‌కి ‘మీడియా’పై ఉన్న గౌర‌వాన్ని తెలియ‌జేసింది. మీడియా మిత్రులంద‌రితోనూ, స‌మంత, చైతూ ఓపిగ్గా ఫొటోల‌కు పోజులివ్వ‌డం క‌నిపించింది. పలు భాషల నుండి సెలబ్రిటీలు మెరిసినా టాలీవుడ్ లో ముఖ్యమైన వాళ్ళు విందులో క‌నిపించ‌క‌పోవ‌డం కాస్త చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

మ‌హేష్‌, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఈ విందులో క‌నిపించ‌లేదు. వీళ్లంతా త‌మ త‌మ సినిమాల‌తో బిజీగా ఉన్నా, కొంత‌మంది హైద్రాబాద్ లోనే ఉన్నారు. పైగా రెండో ఆదివారం షూటింగుల‌కూ సెల‌వు. అయినా ఎందుకు రాలేదో? హరికృష్ణ కనిపించారు గానీ నంద‌మూరి బాల‌కృష్ణ  క‌నిపించ‌లేదు. హాజరు కాని వారికి ఆహ్వానాలు అందాయా.? లేదా?? అనే విష‌యంలో మ‌రోసారి చిత్ర‌సీమ‌లో చ‌ర్చ మొద‌లైంది. మీడియా క‌వ‌రేజీకి అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం, స్టిల్స్ కొన్ని మాత్ర‌మే బ‌య‌ట‌కు విడుద‌ల చేయ‌డంతో రిసెప్ష‌న్ సంగ‌తులేవీ పూర్తి స్థాయిలో బ‌య‌ట‌కు రాలేదు.