చంద్రబాబు తెతెదేపాను సీరియస్ గా తీసుకోవట్లేదా.?

357

తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి  రాజీనామా చేయ‌డంతో గ‌తవారంగా కొన‌సాగుతున్న హైడ్రామాకు తెర‌ ప‌డిపోయింది. ఆయ‌న కాంగ్రెస్ లో చేరితే ఎప్పుడూ ఏంటీ ఎలా, చేరాక ఆయ‌నకు ద‌క్కే ప్రాధాన్య‌త ఏంటీ, ఎన్నికలు వ‌చ్చేనాటికి ఆ పార్టీలో రేవంత్ కు ఏ పాత్ర ఇస్తారనే వైపు చ‌ర్చంతా వెళ్ళిపోయింది. కేసీఆర్ పై పోరాటంలో భాగంగా తెదేపాలో కొన‌సాగే ప‌రిస్థితి లేదంటూ రేవంత్‌ దూర‌మ‌య్యారు.

వాస్తవానికి తెలంగాణ‌లో తెలుగుదేశం ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంద‌నే చ‌ర్చ ద‌గ్గ‌రే రేవంత్ రెడ్డి ఎలిమినేష‌న్ రౌండ్ ప్రారంభ‌మైంది. కానీ, దాన్ని ప్రతిపాదించిన రేవంత్ ను బ‌య‌ట‌కి పంప‌డ‌మే అజెండాగా మారిపోయింది. విదేశాల్లో ఉన్న పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చాక చ‌ర్య‌లు ఉంటాయ‌నేసారు. ఈలోగా మోత్కుప‌ల్లి, ఎల్. ర‌మ‌ణ వంటివారు ఫిర్యాదుల‌పై ఫిర్యాదులు చేసేశారు. కానీ, చివ‌రికి పార్టీ నుంచి చాలా మ‌ర్యాద‌పూర్వంగా, ఎంతో ప్ర‌శాంతంగా రేవంత్ రెడ్డి బ‌య‌ట‌కి వెళ్ళే ప‌రిస్థితిని చంద్ర‌బాబే క‌ల్పించారు.

ఈ మొత్తం ఎపిసోడ్ పరిశీలిస్తే తెలంగాణ తెలుగుదేశం పార్టీపై జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు బాధ్య‌త ఉందా లేదా అనే అనుమానం క‌లుగుతుంది. ఎందుకంటే, రేవంత్ రెడ్డిపై వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కి ఏ స్థాయి అభిమానం ఉన్నా అది వేరే అంశం. ఒక రాష్ట్రంలో బ‌ల‌మైన మూలాలున్న పార్టీ నిర్వీర్యం అయిపోతూ ఉంటే అధ్య‌క్షుడిగా ఆయ‌న ప్రవర్తించలేదు. 15 మంది ఎమ్మెల్యేల‌తో గ‌త ఎన్నిక‌ల్లో నిలిచిన పార్టీలో అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌కుల్లో ఒక‌రైన రేవంత్ వెళ్ళిపోతుంటే, పార్టీకి జ‌రుగుతున్న న‌ష్టాన్ని చూస్తూ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఎందుకు ఊరుకుంటున్నారు.?

గ‌డ‌చిన ఆర్నెల్లుగా రేవంత్ ప‌క్క‌చూపులు చూస్తున్న‌ట్టు పార్టీ నేత‌ల‌కు ముందే తెలుస‌ని ఇప్పుడు చెపుతున్నారంటే ఈ విషయం అధినేతకు కూడా తెలిసే ఉండాలి. అలాంటి తరుణంలో వ‌చ్చీరావ‌డంతో రేవంత్ ను ప‌క్క‌న కూర్చోబెట్టుకుని, కూల్ గా రాజీనామా చేసి వెళ్ళేలా వెలుసుబాటు క‌ల్పించ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తెలంగాణ‌లో పార్టీ భవిష్యత్తుపై చంద్ర‌బాబు ఆలోచిస్తున్నారా అనే అనుమానం కలగక మానదు. కూలిపోతున్న పార్టీని నిల‌బెట్టే చ‌ర్య‌లు చేప‌డుతున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు.