ఏపీకి కేంద్రం వాగ్దానాలు నెరవేరేనా.?

63
పార్ల‌మెంటులో భాజ‌పాపై తెదేపా ఎంపీలు పోరాటం కొన‌సాగించారు. దీంతో పాటు, ఇంకోపక్క రాష్ట్రానికి అవ‌స‌రమైన నిధుల సాధ‌న కోసం కీల‌క శాఖ‌ల మంత్రుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. మంత్రి సుజ‌నా చౌద‌రి ఈ చ‌ర్చ‌ల్లో కీల‌కపాత్ర పోషించారు. ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ, అమిత్ షా, రైల్వే మంత్రి పీయూష్ ఘోయ‌ల్ తో భేటీ అయ్యారు. ఏపీ డిమాండ్ల‌ను ప్ర‌ధానంగా వారి ముందుంచారు. మొత్తానికి, ఈ డిమాండ్ల‌పై కేంద్రం కొంత దిగొచ్చి, సానుకూలంగా స్పందించే విధంగా ఒత్తిడి చేయ‌గ‌లిగారు. దీంతో కొన్ని కీల‌క అంశాల‌పై కేంద్రం స్పందించి, సూత్ర‌ప్రాయంగా అంగీకారాలు తెలిపినట్టు సమాచారం.
కీల‌క‌మైన రైల్వే జోన్ పై కేంద్రం సుముఖ‌త వ్య‌క్తం చేసింద‌నీ, త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అంటున్నారు. అంతేకాదు, ప్ర‌త్యేక హోదాకు స‌మానంగా ఇస్తామ‌న్న ప్యాకేజీ నిధుల‌కు సంబంధించి కూడా కేంద్రంతో ఒక ఒప్పందం కుదిరింద‌ని స‌మాచారం. దుర్గ‌రాజుప‌ట్నం విష‌య‌మై ఇస్రోకు కొన్ని అభ్యంత‌రాలు ఉన్నాయి కాబ‌ట్టి, పోర్టు నిర్మాణానికి మ‌రో చోటును సూచించాల‌ని రాష్ట్రాన్ని కేంద్రం కోరిన‌ట్టు తెలుస్తోంది. స్టీల్ ప్లాంటు విష‌యంలో కూడా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్యంలో నిర్మించేందుకు సూత్ర‌ప్రాయంగా అంగీకారం తెలిపిన‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్ర‌మే పూర్తి చేస్తుంద‌ని కూడా ప్ర‌భుత్వం చెప్పింద‌నీ, పెట్రో కెమిక‌ల్ రిఫైన‌రీకి సంబంధించిన నిధుల విష‌య‌మై కూడా వ‌య‌బిటీ గ్యాప్ ను కేంద్ర‌మే భ‌రిస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.
కీల‌క‌మైన రెవెన్యూ లోటు భ‌ర్తీపై కూడా స్పష్ట‌త వ‌చ్చింద‌నీ, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేర‌కు ప‌ది నెల‌ల కాలానికి వ‌ర్తింపజేస్తామ‌ని కూడా కేంద్రం స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి, వ‌రుస‌గా నాలుగో రోజుల నుంచి ఏపీ స‌ర్కారు చేస్తున్న ఒత్తిళ్లు కేంద్రంపై కొంత ప‌నిచేసాయ‌నే చెప్పుకోవచ్చు. ఎందుకంటే, పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ భాజ‌పా స‌ర్కారు ధోర‌ణి చాలా తీవ్రంగా ఉండ‌టం గ‌మ‌నించాం. ఆంధ్రా విష‌య‌మై ఇంత ప‌ట్టుద‌ల‌తో, ఇంత మొండిగా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే, ఎట్ట‌కేల‌కు ఏపీ నేత‌లు జ‌రిపిన చ‌ర్చ‌లు కొంత మేర‌కు స‌త్ఫ‌లితాల‌ను సాధించాయ‌ని చెప్పాలి.
ఏపీకి సంబంధించిన కీల‌క అంశాల‌పై కేంద్రం సానుకూలంగా స్పందిస్తున్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నా వీటిపై మ‌రింత స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న విడుద‌ల కావాల్సి ఉంది. వీటికి సంబంధించి స్ప‌ష్ట‌మైన కార్యాచ‌ర‌ణ‌, టైమ్ ఫ్రేమ్ ప్ర‌క‌టిస్తే త‌ప్ప‌.. ఏపీ విష‌య‌మై కేంద్రం చిత్త‌శుద్ధిని నూటికి నూరుశాతం న‌మ్మే వాతావ‌ర‌ణం లేదు. ఉభ‌య స‌భ‌ల్లో ఏపీ ప‌ట్ల భాజ‌పా నిర్ల‌క్ష్య వైఖ‌రి తీవ్ర‌స్థాయిలో ప్ర‌ద‌ర్శిస్తూ ఉన్నా మ‌రోప‌క్క కేంద్ర పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి, వారికి ఒప్పించే స్థాయి వ‌ర‌కూ తీసుకొచ్చిన ఒత్తిడి ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.