నంద్యాల ఫలితం ‘భాజపా’కి క్లారిటీ తెచ్చిందా.?

416

నంద్యాల ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఇది రెఫ‌రెండ‌మే కాద‌ని వైకాపా మాట మార్చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి, ఎన్నిక‌ల‌కు రావాలనీ, అప్పుడు అస‌లైన రెఫ‌రెండ‌మ్ అవుతుంద‌ని కొత్త పాట అందుకున్నారు. వారు ఎంత కాదంటున్నా నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌భావం ఆంధ్ర రాష్ట్ర రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌పై ఉంద‌నేది వాస్త‌వం. ముఖ్యంగా కేంద్రంలోని అధికారంలో ఉన్న భాజ‌పా ఆలోచ‌న‌పై చాలా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. వైకాపాతో పొత్తు ఉండే అవ‌కాశం లేద‌నీ, తెదేపాతోనే కొన‌సాగేందుకు భాజ‌పా సుముఖంగా ఉన్న‌ట్టు చాలా విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ, ఒక ఉప ఎన్నిక ఫ‌లితం భాజ‌పాని అంత‌గా ఎందుకు ప్ర‌భావితం చేసింది..?

వాస్తవానికి ఈ ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీకి బాగానే ఉప‌యోగ‌ప‌డింద‌ని చెప్పాలి. మూడున్న‌రేళ్ళ పాల‌న‌పై ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నార‌ని ప్రచారం చేసుకోవ‌డానికి, భాజ‌పా పొత్తు వ్య‌వ‌హారంపై ఒక స్ప‌ష్ట‌త రావ‌డానికి కూడా సాయమందించింది. ఆంధ్రాలో భాజ‌పా సొంతంగా ఎదిగే అవ‌కాశం ఇప్ప‌ట్లో లేద‌నేది వాస్త‌వం. టార్గెట్ 2024 లోగా కేంద్రంలోని అవ‌స‌రాల దృష్ట్యా ఆంధ్రాలో తెలుగుదేశంతోనే కొన‌సాగాల్సిన ప‌రిస్థితి ఉంద‌నే చెప్పాలి. అయితే, ఇటీవ‌లి కాలంలో జ‌గ‌న్ ను మ‌చ్చిక చేసుకుంటున్న‌ట్టుగా క‌నిపించినా నంద్యాల ఫ‌లితంతో ఆ వ్యూహం స‌రైంది కాద‌నే ఆలోచ‌న‌కు భాజ‌పా వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌లో భాజ‌పాకు తెలుగుదేశం ఒంట‌రి పోరాటం కనిపించింది. భూమా కుటుంబానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ద్ద‌తు ఇస్తార‌ని అనుకున్నారు. కానీ, తాను త‌ట‌స్థంగా ఉంటున్న‌ట్టు ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చేసారు. ఇక‌, భాజ‌పా కూడా పెద్ద‌గా మ‌ద్ద‌తు ఇచ్చిందేం లేదు. దీంతో తెదేపా ఒంట‌రిగానే భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో నంద్యాల ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు చేసిన వ్యూహాత్మ‌క ప్ర‌చారం భాజ‌పాకి ఆక‌ర్షించింద‌ని అంటున్నారు. పార్టీ శ్రేణుల‌నూ నాయ‌కుల‌నూ మంత్రుల‌ను ద‌శ‌లువారీగా నంద్యాల‌లో ఒక ప్ర‌ణాళిక‌ ప్ర‌కారం న‌డిపించ‌గ‌లిగార‌నేది అమిత్ షాకు చేరిన రిపోర్టుగా చెబుతున్నారు.