కాంగ్రెస్ ఇప్పటికైనా తెలుసుకుంటుందా.?

87

కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలవకపోయినా భాజపాకి అధికారం దక్కనీయకూడదన్న ఉద్దేశంతో వ్యూహాలు పన్నుతోంది. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఖాయమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో కౌంటింగ్ ముందు రోజు ఢిల్లీ నుంచి గులాంనబీ ఆజాద్, ఆశోక్ గెహ్లాట్ హుటాహుటిన బెంగుళూరు వచ్చారు. వెంటనే జేడీఎస్‌తో చర్చలు ప్రారంభించారు.

అనుకున్నట్లుగానే ఫలితాలు హంగ్ అయ్యాయి. మధ్యలో భాజపా లీడ్‌లోకి వచ్చినా కుమారస్వామి, దేవేగౌడలతో చర్చిస్తూనే ఉన్నారు. నేరుగా సోనియాగాంధీతో దేవేగౌడను మాట్లాడించారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతిచ్చిన మాయావతితో కూడా ఫోన్ చేయించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి కూడా దేవేగౌడకు ఫోన్ చేసి కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని కోరారు. దాంతో దేవేగౌడ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు.

చూస్తుంటే కాంగ్రెస్ గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లుగానే కనిపిస్తోంది. గోవాలో, మణిపూర్‌లో కొద్దిగా ప్రయత్నిస్తే ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం వచ్చేది.  దాంతో సొంత పార్టీలో కొంత మంది నేతలు అసంతృప్త స్వరం కూడా వినిపించారు. ఈసారి కర్ణాటక విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంది. కేంద్రంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు, ఫలితాలకు,ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మధ్య చిత్రమైన ప్రజాస్వామ్యాన్ని తెరపైకి తెచ్చింది. హంగ్ అనే పదం వినిపిస్తే అది తమ ఖాతాలోకి చేరిపోయేలా పరిస్థితిని మార్చేసుకుంది.

సాధారణంగా ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటు కోసం మొదట గవర్నర్ ఆహ్వానిస్తారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిని మార్చేసింది. గోవా, మణిపూర్‌, మేఘాలయాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 17, భాజపాకి 13 మాత్రమే వచ్చాయి. కానీ అక్కడ గవర్నర్ భాజపాని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. మణిపూర్‌లో 60 స్థానాలకు గాను కాంగ్రెస్‌ కు 28 సీట్లు వచ్చాయి. భాజపాకు 21 స్థానాలు మాత్రమే దక్కినా కుర్చీ ఎక్కడానికి భాజపాకి గవర్నర్‌ అవకాశం ఇచ్చారు. మేఘాలయాలో కూడా రెండు సీట్లు మాత్రమే వచ్చిన భాజపా కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసింది.