జనసేన వైపు ‘సీపీఎం’ అడుగులు ..మరి జనసేన.?

50

జనసేన అధినేత తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టారు. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ప్రచార బరిలోకి కూడా దిగిపోయారు. విపక్ష పార్టీలు పొత్తుల సన్నాహాల్లో ఉన్నాయి.

అయితే ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ పేరుతో ప్రత్యేకంగా కూటమి పెట్టుకున్న సీపీఎం,  తెరాస వ్యతిరేక కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు గత నెలలోనే సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేన అధినేతకు లేఖ రాసిన తర్వాత పొత్తుల విషయంలో రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయి.

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ, తమ్మినేని వీరభద్రంతో గత వారం చర్చించింది. చర్చలు ఫలవంతంగా జరిగాయని తదుపరి చర్చల్లో పవన్ పాల్గొనాలని సూచించారు. దానికి పవన్ కల్యాణ్ అంగీకరించారు. ఈ మేరకు సీపీఎంకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ నేపధ్యంలో మంగళవారం లేదా బుధవారం సీపీఎం తెలగాణ నేతలు జనసేన అధినేతతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

అయితే జనసేనతో పొత్తు విషయంలో సీపీఎంలో ఏకాభిప్రాయం లేదన్న వాదన వినిపిస్తోంది. ఒక్క తమ్మినేని వీరభద్రం మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారని, మిగతా నేతలంతా తెరాస వ్యతిరేక మహాకూటమిలో భాగం కావాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీతో కలవకూడదన్నది సీపీఎం జాతీయ విధానం కాబట్టి ఆ విధానం మేరకు కాంగ్రెస్ ఉన్న కూటమిలో చేరకూడదని వీరభద్రం వాదిస్తున్నారు.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ విషయంపై నిర్ణయం తీసుకుని ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు..? అన్నదానిపై క్లారిటీ ఇస్తే సీపీఎంతో పొత్తు వ్యవహారాలపై స్పష్టత వస్తుంది. పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో జనసేనకు ఒక వ్యవస్థను ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. ఈ మేరకు అసలు జనసేనకు తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశంలో లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. బేషరతుగా సీపీఎంకు మద్దతు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.