తెలంగాణ మాదిరి ఏపీలో వర్కవుట్ అవుతుందా.?

126

ప్ర‌త్యేక హోదా ఉద్యమానికి పున‌రుజ్జీవం ఇస్తున్న‌ట్టుగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్రకటించారు. పాద‌యాత్ర‌కు వెళ్ళినా పార్టీ ఎమ్మెల్యేలూ ఇత‌ర నేత‌లు ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తార‌న్నారు. ప్ర‌త్యేక హోదా సాధ‌నలో చివ‌రి అస్త్రంగా ఎంపీలు రాజీనామాలు చేస్తార‌ని కూడా చెప్పారు. తెలంగాణలో మాదిరి కేసీఆర్ స్ఫూర్తితోనే రాజీనామాల అంశాన్ని జ‌గ‌న్ మ‌రోసారి తెర‌మీదికి తెచ్చార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది.

తెలంగాణ సాధ‌న‌ ఉద్య‌మాన్ని స‌జీవంగా ఉంచేందుకు కేసీఆర్ ఇదే ఫార్ములాను అనుస‌రించార‌నీ, దాన్నే ఇప్పుడు జ‌గ‌న్ ఫాలో అవుతున్నారంటూ కొంత‌మంది విశ్లేషించేస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఈ రాజీనామాల‌తోనే ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. అయితే, ఇదే ఫార్ములా ఆంధ్రాలో వ‌ర్కౌట్ అయ్యే అవ‌కాశాలు త‌క్కువ‌. ఎందుకంటే, తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆ సెంటిమెంట్ ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంది. ప్ర‌త్యేక రాష్ట్రం కావాల‌నే ఒక‌ బ‌లీయ‌మైన ప్ర‌జాభిప్రాయానికి కేసీఆర్ ఆస‌రా అయ్యారు. ఉద్య‌మాన్ని కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా నిర్మిస్తూ వ‌చ్చారు.

ప్ర‌త్యేక హోదాకు సంబంధించి ఏపీ ప్ర‌జ‌ల్లో అలాంటి సెంటిమెంట్ ఇప్పుడు లేదు. విశాఖ సాగ‌ర‌తీరంలో యువ‌త నిర‌స‌న చేప‌ట్టిన నాటి నుండి జ‌గ‌న్ అదే వేడిని కొన‌సాగించి ఉంటే ప‌రిస్థితి వేరేలా ఉండేదేమో. ఆ త‌రువాత‌, జ‌గ‌న్ కూడా ప్ర‌త్యేక‌మైన కార్యాచ‌ర‌ణ అనుసరించ‌లేదు. ప్రస్తుత ప‌రిస్థితిలో హోదా వ‌చ్చి తీరాల‌నీ, లేదా రాక‌పోవ‌డం వ‌ల్ల చాలా అన్యాయానికి గురైపోయామ‌న్న భావ‌నే ఆంధ్రా ప్ర‌జ‌ల్లో లేదు. కాబ‌ట్టి, ఎంపీల రాజీనామా వ‌ల్ల కొత్త‌గా వ‌చ్చే ఊపు ఉండ‌ద‌నే అనిపిస్తోంది.

ప్రత్యేక హోదా సాధ‌న ఉద్య‌మాన్ని తీవ్రంగా న‌డిపి, ఎన్నో పోరాటాలు చేసి, ప్ర‌భుత్వం నుంచి అడ్డంకులు ఎదుర్కొన్న అనుభ‌వాలు వైకాపాకి ఉంటే రాజీనామాలు చేసినా కొంత ప్ర‌భావం ఉండేదేమో. ఎన్నిక‌ల ముందు కొంత హ‌డావుడి సృష్టించ‌డానికి రాజీనామాల ప‌ర్వం కొంత ఉపయోగపడొచ్చు.