కేసీఆర్ కు ‘ఉత్తమ్’ కుమార్ జుట్టు దొరికిందా.?

178

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజ‌కీయాల్లో చాణ‌క్యుడు అనే ఇమేజ్ ఉంది. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను ఆయన చాకచక్యంగా ఎదుర్కొనే విధానం చూసిన వారు ఆయనను అలానే పిలుస్తారు. తాజాగా పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని నియంత్రించే బ‌ల‌మైన ఆయుధం ఆయ‌న‌కి చేతికి అందిందని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ నాయ‌కుడిగా ఉత్త‌మ్ చేసిన ప‌నుల‌పై గ‌ట్టి నిఘా వేయించార‌నీ, దానికి సంబంధించి కొన్ని నివేదిక‌లు కూడా సిద్ధంగా ఉన్నాయ‌ని మాటలు బ‌లంగా వినిపిస్తున్నాయి. గృహ‌ నిర్మాణాల్లో అవ‌క‌త‌వ‌క‌లు వెలికి తీయాల‌ని సీఐడీని కేసీఆర్ ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. దీంతో గ‌తంలో చేప‌ట్టిన ఇళ్ళ నిర్మాణాల్లో వంద‌ల కోట్ల అవినీతి జ‌రిగిన‌ట్టు ఆధారాలు ల‌భించాయ‌ట‌.

ఉమ్మ‌డి రాష్ట్రంలో వైయ‌స్ హ‌యాంలో రాజీవ్ గృహ క‌ల్ప ఇళ్ళ నిర్మాణం కోసం ఏర్ప‌డిన కార్పొరేష‌న్ అప్ప‌ట్లో న‌ష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఎస్క‌లేష‌న్స్ పెంచాలంటూ ఉత్త‌మ్ కుమార్ రెడ్డితోపాటు మ‌రో ముగ్గురు కాంగ్రెస్ నేత‌లున్న క‌మిటీ సిఫార్సు చేసింది. ప‌ది కంపెనీలు నిర్మాణం చేప‌డితే, వాటిలో రెండు కంపెనీలు మాత్ర‌మే ఎస్క‌లేష‌న్ పెంచేసి, వెంట‌నే బిల్లులు కూడా చెల్లించేసారు. అప్ప‌టికి ఉత్త‌మ్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు.

ఆ రెండు కంపెనీల‌కూ అంచ‌నా కంటే దాదాపు రూ. 60 కోట్ల అద‌నం చెల్లించ‌డం జ‌రిగింద‌ని ఈ కంపెనీల‌కూ ఉత్త‌మ్ కీ మంచి సంబంధాలే ఉన్నాయ‌ని తాజా విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డిందట‌. ఆ ఫైల్ కేసీఆర్ చేతిలో ఉంద‌నీ, ఉత్త‌మ్ ఊచ‌లు లెక్క‌పెట్ట‌క త‌ప్ప‌దంటూ ఇప్ప‌టికే కొంత‌మంది తెరాస నేత‌లు మాట్లాడుకుంటున్నార‌ట‌. అయితే దీనిపై కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం ఉత్త‌మ్ కూడా చేయ‌డం లేదు. దీనిపై మున్ముందు కాంగ్రెస్ వైఖ‌రి ఎలా ఉంటుందో చూడాలి.