లగడపాటి రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువేనట.!

260

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. విజయవాడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు ఎన్నికలయిన లగడపాటి రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి వైదొలుగుతానని చాలెంజ్ చేసారు. అన్నట్లుగానే గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.

గత నాలుగేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా సర్వేలు చేస్తూ ఫలితాలు ప్రకటిస్తున్నారు. వ్యక్తిగత ఆసక్తి మేరకే సర్వేలు చేస్తున్నానని మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని పదే పదే చెప్పారు. నంద్యాల ఉపఎన్నికలు, కాకినాడ కార్పొరేషన్ ఉపఎన్నికల్లో ఆయన టీమ్ చేసిన సర్వే నూరు శాతం నిజమైంది.

ఇటీవలి కాలంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును లగడపాటి రాజగోపాల్ తరచూ కలుస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేని భేటీలని ప్రచారం జరుగుతున్నప్పటికీ తెదేపాలో మాత్రం ఊహాగానాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం చంద్రబాబును కలిసి సర్వే నివేదికను అందజేసినట్లు ప్రచారం జరిగింది. దాని ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి 110 స్థానాలు వస్తాయని అంచనా వేసినట్లు సమాచారం.

మరోవైపు లగడపాటి మరోసారి రాజకీయాల్లోకి వస్తే తెదేపా ద్వారానే కానీ వైకాపా, భాజపా, కాంగ్రెస్‌ల వైపు చూడరని ఆయన అనుచరులు చెబుతున్నారు. రాజకీయాల నుంచి విరమించుకున్నా విజయవాడలో ఆయన తన వర్గంతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఏలూరు లేదా నూజివీడు స్థానాల నుంచి పోటీ చేయటంపై తన సన్నిహితులతో చర్చించటం ప్రారంభించారని చెబుతున్నారు.