ఇప్పటికైనా తెలుసుకుంటారో.? లేదో.?

449

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అనూహ్య మెజారిటీ సాధించింది . ఈ విజ‌యంతో తెదేపా శ్రేణులు మాంచి జోష్ లో ఉన్నాయి. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి నంద్యాల ప్ర‌జ‌లు ఓట్లేసార‌ని మంత్రులూ నేత‌లు చెబుతున్నారు. మ‌రోప‌క్క వైకాపా శిబిరం మూగ‌బోయింది. లోట‌స్ పాండ్ లోని జ‌గ‌న్ కార్యాల‌యం ఎన్నిక‌ల ఫ‌లితాలు మొద‌లైన కాసేప‌టికే ఖాళీ అయిపోయింది. ఓట్ల లెక్కింపు పూర్త‌వ‌కుండానే నంద్యాల వైకాపా అభ్య‌ర్థి శిల్పా కూడా ఇంటికెళ్ళిపోయారు. ఇంతకీ ఈ ఫ‌లితం ఎవ‌రికి ఎలాంటి పాఠాలు చెప్పింది.?

నిజానికి, ఈ విజ‌యంతో విశ్రాంతి తీసుకునే ప‌రిస్థితి తెలుగుదేశానికీ లేదు.. వైఫ‌ల్య భారంతో నిరాశ‌లో మ‌గ్గిపోవాల్సిన ప‌రిస్థితి వైకాపాకీ లేదు. తెలుగుదేశం విష‌యానికొస్తే ఈ ఎన్నిక‌ల్లో భూమా నాగిరెడ్డిపై ఉన్న సానుభూతితోపాటు, తెలుగుదేశం పార్టీ చేప‌ట్టిన అభవృద్ధి ప‌థ‌కాలే విజ‌యాన్ని తెచ్చిపెట్టాయ‌ని చెప్పుకుంటున్నారు. నిజ‌మే, అభివృద్ధి పేరుతో వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను నంద్యాల నియోజ‌క వ‌ర్గంపై గుమ్మ‌రించారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు హుటాహుటిన చేప‌ట్టారు. ఈ ప‌నుల‌కు ఫ‌లిత‌మే నంద్యాల విజ‌య‌మంటున్నారు. 2019లో కూడా ఈ అభివృద్ధే మ‌రోసారి అధికారాన్ని క‌ట్ట‌బెడుతుంద‌ని ఆశిస్తున్నారు. అయితే, నంద్యాల స్థాయిలోనే రాష్ట్రంలో ఇత‌ర నియోజ‌క వ‌ర్గాల్లో అభివృద్ధి జ‌రుగుతోందా అనేది తెదేపా విశ్లేషించుకోవాలి.

వైకాపా విష‌యానికొస్తే ప్ర‌జ‌ల్లో ఉన్న‌ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ఒడిసిప‌ట్ట‌డంలో విపక్ష నేత ఫెయిలవుతున్నారు. తెదేపా మీద ఉన్న వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల్లోంచి వచ్చి ప్ర‌త్నామ్నాయంగా వైకాపా అనేది ప్ర‌జ‌ల‌కే క‌నిపించాలి. కానీ, జ‌గన్ నిర్వ‌హిస్తున్న ప్రచారం త‌న వ్య‌క్తిగ‌త భావోద్వేగాల్లోంచి ప్ర‌జ‌ల‌ను స్పందింప‌జేసేదిగా ఉంటోంది. చంద్ర‌బాబు నాయుడిపై వ్య‌క్తిగ‌త దాడికే దిగుతూ వ‌చ్చారు. ఒక త‌ట‌స్థ ఓట‌రును ఆలోచింప‌జేసే విధంగా, ప్ర‌భావితం చేసే విధంగా ఆయ‌న ప్ర‌సంగాలు ఉండ‌టం లేదు. గ‌డ‌చిన మూడున్న‌రేళ్ళుగా విప‌క్షంగా ఉంటున్న‌ వైకాపా ఏం సాధించింద‌నేది అసలు ప్ర‌శ్న. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని మ‌ధ్య‌లోనే వ‌దిలేసారు. ఉద్దానం కిడ్నీ బాధలు,  ఆక్వా రైతుల స‌మ‌స్య‌లు, అగ్రిగోల్డ్ బాధితులు, రాజ‌ధాని నిర్వాసితులు ఇలాంటి ప్ర‌జా స‌మ‌స్య‌లపై త‌మ‌దైన ముద్ర వేసుకోలేక‌పోయారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున వైకాపా సాగించిన తిరుగులేని పోరాటం ఇదీ అని బ‌లంగా చెప్పుకునేందుకు ఏదీ లేకుండా చేసుకున్నారు.