కర్ణాటక రాజకీయంలో ‘గవర్నర్’ పాత్రే కీలకం

87

ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక క‌ర్ణాట‌కలో ప్ర‌భుత్వం ఏర్పాటుకు ఏ పార్టీని గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానిస్తార‌నేది అత్యంత కీల‌కంగా మారింది. భార‌తీయ జ‌న‌తా పార్టీకి 104 సీట్లు వ‌చ్చాయి. కాబ‌ట్టి, అతి పెద్ద పార్టీగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని భాజ‌పాని ముందుగా కోరే అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు.

జేడీఎస్-38, కాంగ్రెస్-78 ఈ రెండు కూట‌మిగా ఏర్ప‌డటంతో వారి బ‌లం 116కి చేరింది. అంటే, ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ కు ఈ కూట‌మి చేరుకుంది. ఈ లెక్క‌న వీరికే ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌కాశం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఈ రెండింటిలో గ‌వ‌ర్న‌ర్ ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠ రేపుతోంది. క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ వ‌జుభాయ్ గుజ‌రాత్ లో 2012 నుంచి 2014 వ‌ర‌కూ స్పీక‌ర్ గా ప‌నిచేసారు. క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత ఎవ‌రిని ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల‌నే అంశంపై ఆయ‌న రాజ్యాంగ నిపుణుల‌తో చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది.

అయితే, ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక రూల్ ఉంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎన్నిక‌ల ముందు పొత్తు కుదుర్చుకున్న పార్టీల కూట‌మిని ముందుగా ప్ర‌భుత్వ ఏర్ప‌ాటుకు గ‌వ‌ర్న‌ర్ పిలవాల‌నీ, ఆ ప‌రిస్థితి లేక‌పోతే ఎన్నిక‌ల త‌రువాత పొత్తు కుదుర్చుకున్న పార్టీల కూట‌మిని ఆహ్వానించాలి. అలాంటి ప‌రిస్థితీ లేన‌ప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్ర‌భుత్వ ఏర్పాటుకు పిల‌వాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

భాజ‌పా విష‌యానికే వ‌స్తే ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి, గవర్నర్ ముందుగా తమనే పిలవాలని వాదిస్తున్నారు. వాస్తవానికి మ‌ణిపూర్ లో గ‌త ఏడాది భాజ‌పాకి కాంగ్రెస్ కన్నా త‌క్కువ సీట్లే వ‌చ్చాయి. కానీ, భాజ‌పా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. మేఘాల‌యాలో భాజ‌పా కూట‌మికే ప్ర‌భుత్వ ఏర్పాటు ఆహ్వానం అందింది. 2013లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి భాజ‌పా కంటే త‌క్కువ సీట్లే వ‌చ్చినా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. 2005లో కేవ‌లం ఐదు సీట్ల‌తోనే జార్ఖండ్ లో జెఎమ్ఎమ్‌ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ పాత్ర ఎలా ఉంటుంద‌నేది వేచి చూడాలి.