వైకాపా ఎన్నికల మేనిఫెస్టో పెరుగుతోం………దిగా.!

108

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లుపెట్టి ఆరు రోజులైంది. ఈ సంద‌ర్భంగా ప్రొద్దుటూరులోనూ, దువ్వూరులోనూ జ‌గ‌న్ మాట్లాడారు. ‘మ‌న ప్ర‌భుత్వం వ‌స్తే, మ‌నంద‌రం కోరుకుంటున్న ప్ర‌భుత్వం వ‌స్తే’ త‌మ పాల‌న ఎలా ఉండ‌బోతోందో  చెప్పారు. పాద‌యాత్ర మొద‌లైన రోజు నుంచి ఎలాంటి హామీలైతే ఇచ్చారో.. వాటినే రిపీట్ చేసారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న‌పై రొటీన్ గా విమ‌ర్శ‌లు చేసారు. ఏ ఒక్క రైతుకూ న్యాయం జ‌ర‌గ‌లేద‌న్నారు. వైయ‌స్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు మూడేసి పంట‌లు ప‌డేవ‌నీ, చంద్ర‌బాబు హాయంలో అలాంటి ప‌రిస్థితి లేద‌ని చెప్పారు.

ప్రొద్దుటూరు స‌భలో మ‌రో కొత్త హామీ ఇచ్చారు. కొంత‌మంది ఆటోడ్రైవ‌ర్లు క‌లుసుకుని స‌మ‌స్య‌లు చెప్పార‌న్నారు. వారందరికీ తాను హామీ ఇస్తున్నాన‌నీ, మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక అంద‌రి ఆటోల్లోనూ నాన్న వైయ‌స్సార్ తోపాటు త‌న ఫొటోను కూడా పెట్టుకునేంతగా కార్య‌క్ర‌మాలు చేసి చూపించే ఆలోచ‌న చేస్తాన‌న్నారు. పిల్ల‌ల్ని స్కూళ్ళకు పంపిస్తే చాలు ఏడాదికి రూ.15 వేలు ఇస్తార‌ట‌. పేద విద్యార్థులు పెద్ద చ‌దువులకు వెళ్తే చాలు మొత్తం ఫీజు క‌ట్టేసి, ఏడాది పొడ‌వునా చేతి ఖ‌ర్చుల‌కు కావాల్సి సొమ్ము కూడా ఇస్తార‌ట‌.

వైకాపా మేనిఫెస్టో ఎలా ఉంటుందో అనేది కూడా మ‌రోసారి చెప్పారు. ఎన్నిక‌లు వ‌చ్చే నాటికి ప్ర‌జ‌లు త‌యారు చేసిన మేనిఫెస్టోతో సిద్ధ‌మౌతాన‌నీ, అది కూడా రెండూ లేదా మూడు పేజీలు మాత్ర‌మే ఉంటుంద‌ని జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతున్నారు. అయితే ప్ర‌భుత్వం వ‌స్తే వ‌స్తే అంటూ ప‌దేప‌దే వ‌రాలు వ‌ర‌ద ఉంటుంద‌ని చెబుతున్నారు క‌దా. మ‌రి, ఇవ‌న్నీ మేనిఫెస్టోలో పెడితే మూడు పేజీలు  సరిపోతాయా.? న‌వ‌ర‌త్నాలు, ద‌శ‌ల‌వారీ మద్య నిషేధం, పెన్ష‌న్లు వంటి స్టాండ‌ర్డ్ హామీలు ఉండనే ఉన్నాయి. కానీ, వాటికి అద‌నంగా రోజుకో కొత్త హామీ వ‌చ్చి చేరుతోంది మరి.