సీనియర్స్ ను కూడా ఆశ్చర్యపరుస్తున్న జగన్ వ్యూహ చాతుర్యం

534

2014 ఎన్నికలకు పూర్వం…

తన పార్టీ సమావేశంలో ఎన్నికల వ్యూహం గూర్చి చర్చిస్తున్నప్పుడు… రుణమాఫీ చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వమని కొందరు నాయకులు జగన్ ను కోరారు. అందుకు జగన్ నిరాకరిస్తూ “పదహారు వేలకొట్ల రూపాయల రెవిన్యూ లోటు తో ఏర్పడుతున్న రాష్ట్రంలో లక్షకోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యడం అసాధ్యం. ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్న వాగ్దానాన్ని నెరవేర్చడం జరిగే పని కాదు. నేను ఆ హామీని ఇస్తే గెలుస్తాను. కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం లోకి వస్తుంది. మోడీ మనకు సహకరించడు. ఈ ఎన్నికలలో మనం ఓడిపోవడం ఖాయం. చంద్రబాబు గెలవడం కూడా ఖాయం. కానీ చంద్రబాబు తాను ఇచ్చిన హామీని నెరవేర్చలేక అభాసుపాలు కావడం కూడా తధ్యం. ఫలితంగా 2019 లో చంద్రబాబు ఓటమి చెందుతారు. అప్పుడు నేను ముఖ్యమంత్రిని అవుతాను. ఆ తరువాత చంద్రబాబు చరిత్రలో కలిసిపోతారు. ఇప్పుడు చెప్పండి.. అబద్ధపు హామీలు ఇచ్చి ఐదేళ్లు అధికారంలో ఉండి ఆ తరువాత అంతర్ధానమై పోదామా లేక నాలుగు కాలాలపాటు అధికారంలో ఉండి ప్రజలకు సేవచేద్దామా?” అని ప్రశ్నించారు.

పార్టీ నాయకుల వద్ద జవాబు లేదు.

ఊహించినట్లే జగన్ అధికారం దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు ఏమైంది? ఎన్నికలలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేక చంద్రబాబు సతమతమై పోతున్నారు. రుణమాఫీ అబాసుపాలైంది. తెలంగాణా ప్రభుత్వం సంపూర్ణ రుణమాఫీ చేసి చేతులు దులుపుకోగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పావు భాగం మాత్రమే రుణమాఫీ చెయ్యగలిగింది. పోనీ, ఎంతో కొంత చేశారు కదా అని రైతులు తృప్తి పడ్డారా అంటే అదీ లేదు. నలుగురికి మాత్రమే కడుపు నింపగల తిండి నీ దగ్గర ఉన్నది. కానీ అక్కడ పదిమంది ఉన్నారు. నువ్వు నలుగురిని ఎన్నిక చేసి వారి కడుపు మాత్రమే నింపితే వారు సంతోషిస్తారు. ఉన్నవరకు పెట్టాడులే అని భోజనం దక్కని వారు భావిస్తారు. అలా కాకుండా నువ్వు పదిమందికీ విస్తళ్ళు వేసి తలా నాలుగు మెతుకులు పెట్టావు. ఎవ్వరి కడుపు నిండదు. చివరకు అందరూ అసంతృప్తి చెంది నిన్ను నిందిస్తారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన పని కూడా అదే. రుణమాఫీ కాకపోవడంతో రైతులు అందరూ ఆగ్రహంగా ఉన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడం తో నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. కాపులకు రిజర్వేషన్ అని చెప్పి ఆ హామీని నిలబెట్టుకోలేకపోవడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పట్ల సమాజంలో ఏ ఒక్క వర్గం కూడా పూర్తి తృప్తిగా లేరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబును గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలుస్తున్నది.

కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు ఏమాత్రం సహకరించడం లేదు. ప్రత్యేక హోదాను పాతేసింది. పాకేజీ ఏమైందో దేవుడికే తెలియాలి. రైల్వే జోన్ లేదు. కడపకు ఇస్తామన్న ఉక్కు కర్మాగారం లేదు. విజయవాడకు మెట్రో రైల్ లేదు. పోలవరం లేదు. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా మోడీ నుంచి అణుమాత్రం కూడా స్పందన లేదు. పైగా చంద్రబాబు కోరినప్పటికీ దర్శనభాగ్యం కూడా కల్పించడం లేదు ఆయన.

ఒకవేళ జగన్ గనుక చంద్రబాబు ఇచ్చిన విధంగా హామీలు ఇచ్చినట్లయితే ఎలా ఉండేది? మాట తప్పిన వాడుగా, మడమ తిప్పిన వాడుగా జగన్ ప్రతిష్ట మంటకలిసేది. ఇప్పుడు జగన్ కున్న పేరు ప్రఖ్యాతులు వైఎస్సార్ వారసత్వంగా వచ్చినవే. ఇచ్చిన మాట కోసం ఎంతకైనా తెగించేవాడుగా వైఎస్సార్ కు ప్రతిష్ట ఉన్నది. ఆ ప్రతిష్ట మాయమై పోయి ఉండేది. జగన్ శాశ్వతంగా ప్రజాక్షేత్రంలో పలుచన అయ్యేవాడు.

మనం అనుకున్నవి, మనం ఊహించినవి చెయ్యడం లేదు అని పొరపడుతూ నిందలు వెయ్యడం శాపనార్ధాలు పెట్టడం సులభమే. కానీ, అసలైన నాయకుడు, ముందు చూపు ఉన్నవాడు భవిష్యత్తును అంచనావేసి పధకాలు రచిస్తాడు. ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి ని కూడా పార్టీలో చేర్చుకోవడం కూడా అలాంటిదే. ఒక బలమైన నాయకుడు వచ్చినపుడు, అదీ వైరి పక్షం నుంచి వచ్చినప్పుడు స్వాగతించడం యుద్ధ ధర్మం తెలిసిన వారు పాటించే నీతి. రావణుడి లంక నుంచి వచ్చినప్పటికీ విభీషణుడిని శ్రీరాముడు అక్కున చేర్చుకున్నాడు. ఆ తరువాత రావణుడిని సమూలంగా నిర్మూలించాడు. పురాణాలు చెప్పే నీతి ఇది.

జగన్ రాజకీయ పరిణితిని అభినందించాల్సిందే.