జగన్ తో పాటే పాదయాత్ర చేస్తే సరిపోదా.?

141

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్నారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స‌మావేశాల‌ను బహిష్క‌రించారు. జ‌గ‌న్ యాత్ర ఏ జిల్లాకి చేరితే అక్క‌డి స్థానిక‌ నేత‌లు ఏర్పాట్లు చూసుకుంటున్నారు. అయితే కొందరు వైకాపా నేత‌లు జ‌గ‌న్ కు స‌మాంతరంగా యాత్ర‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం, వైకాపా ఎమ్మెల్యే రోజా గాలేరు-న‌గరి ప్రాజెక్టు నిర్మాణం విష‌యంలో  పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు.

జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లు కావ‌డానికి కొద్దిరోజుల ముందే న‌ర‌స‌రావుపేట వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి కూడా యాత్ర మొద‌లుపెట్టేసారు. చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి జ‌గ‌న్ యాత్ర పరిపూర్ణం కావాలంటూ దేవుడిని కోరుతూ తిరుమ‌ల‌కు కాలిన‌డ‌క వెళ్ళారు. ఇవ‌న్నీ అధినేత‌కు మ‌ద్ద‌తుగా చేస్తున్న కార్య‌క్ర‌మాలుగా వైకాపా నేత‌లు చెపుతున్నారు. కానీ, వాస్తవానికి దీనిని వ్యూహాత్మ‌క లోపంగానే చూడాలి.

అధినేత పాద‌యాత్ర చేస్తున్న‌ప్పుడు ప్ర‌జ‌ల దృష్టి అంతా ఆయ‌న‌పై ఉండేలానే ఇతర నేతలు ప్రయత్నించాలే గాని ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు కూడా పాద‌యాత్ర‌లు చేస్తుంటే లేనిపోని గంద‌ర‌గోళానికి కార‌ణ‌మౌతాయి. రోజా పాద‌యాత్ర తీసుకుంటే ఆమె కాలికి బొబ్బ‌లు అంటూ కొన్ని ఫొటోలు మీడియాలోకి వ‌చ్చాయి. అయితే, ఇవే చిత్రాల‌ను పెట్టి జ‌గ‌న్ పాదాల‌కూ బొబ్బ‌లెక్కాయంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు వ‌చ్చాయి. అవి జ‌గ‌న్ పాదాలు కావు అని వైకాపా వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.

ఇలాంటి ప‌రిస్థితుల వ‌ల్ల కొంత న‌ష్టం ఉంది. నిజానికి, పాద‌యాత్ర చేస్తున్న‌ప్పుడు జ‌గ‌న్ ప‌డుతున్న క‌ష్టం ప్రెజెంట్ చేసుకునే క‌థ‌నాల ద్వారా ప్ర‌జ‌ల్లో బాగానే సింప‌థీ వ‌స్తుంది. బొబ్బ‌లెక్కిన పాదాలు జ‌గ‌న్ వని అన‌గానే ప్ర‌జా స్పంద‌న ఒక‌లా ఉంటుంది. కాసేప‌టికే కాదు కాదు, ఆ పాదాలు రోజావి అని చెప్ప‌డం ద్వారా మారిపోతుంది. దీని వ‌ల్ల  జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర నుంచీ ప్ర‌జ‌ల దృష్టి కొంత ప‌క్క‌కు పోతుంది. అసలు వారు పాదయాత్ర చేయాలనుకుంటే జ‌గ‌న్ తో పాటే కొన్ని కిలోమీట‌ర్లు నడిస్తే సరిపోతుందిగా.