ఆ ఐదుగురూ..ఉపఎన్నికలకు సిద్దమవుతున్నారు

95
ప్ర‌త్యేక హోదా పోరాటంలో చివ‌రి ప్రయత్నంగా వైకాపా పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలూ రాజీనామాలు చేసారు. అయితే, ఈ రాజీనామాలను లోక్ స‌భ స్పీక‌ర్ ఇంత‌వ‌ర‌కూ ఆమోదించ‌లేదు. ప్ర‌స్తుతం సుమిత్రా మ‌హాజ‌న్ త‌న సొంత నియోజ‌క వ‌ర్గం ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఆమె వ‌చ్చిన వెంట‌నే రాజీనామాలు ఆమోదింప‌జేసుకోవాల‌ని వైకాపా ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.
రాజీనామాల‌పై ఆమోదముద్ర వేయించుకుంటే క‌డ‌ప‌, రాజంపేట‌, నెల్లూరు, ఒంగోలు, తిరుప‌తి ఎంపీ స్థానాల్లో వెంట‌నే ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఆ ఎన్నికలకు ప్రచారంగా ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి భేషుగ్గా ఉప ఎన్నిక‌ల‌కు వెళ్ళిపోవ‌చ్చ‌నే ధీమాతో వైకాపా శ్రేణులు ఉన్నాయని స‌మాచారం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు ఈ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైకాపా గెలుపు మ‌రింత సులువు అవుతుంద‌ని కొంత‌మంది నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారట‌.
మరోవైపు చూస్తే స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదించినంత మాత్రాన వెంట‌నే ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించే ప‌రిస్థితి ఉంటుంద‌న్న ధీమా లేదు. సాంకేతికంగా, సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు ఉప ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అనేది ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ నిర్ణయిస్తుంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాదిక‌న్నా ఎక్కువే స‌మ‌యం ఉంది, కాబ‌ట్టి ఉప ఎన్నిక‌లు వ‌స్తాయ‌న్న‌దే వైకాపా ఆలోచనగా ఉంది. అయితే అవ‌స‌ర‌మ‌నుకుంటే ఆర్నెల్ల ముందే వీలైన‌న్ని రాష్ట్రాల అసెంబ్లీలూ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌ను క‌లిపి నిర్వ‌హించే ఆలోచ‌న‌లో కేంద్రం ఉంది. ఈ దిశ‌గా సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించాలంటూ ఆ మ‌ధ్య ప్ర‌ధాని మోడీ కూడా సంకేతాలు ఇచ్చారు.
క‌ర్ణాట‌క అసెంబ్లీ ఫ‌లితాల త‌రువాత జ‌మిలి ఎన్నిక‌ల‌పై కొంత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఏపీలో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గాలంటే ఇన్ని ప‌రిస్థితులు అనుకూలించాల‌నేది వాస్త‌వం. ఇక్కడ ఎవరైనా సరే ఆలోచించుకోవాల్సిన కీలకాంశం ప్ర‌త్యేక హోదా పోరాటంలో భాగంగా కేంద్రంపై వారు తెచ్చిన ఒత్తిడేమిటి.? అందుకు ప్రజల్లి కలిగిన ప్రభావమేంటి.? ఉప ఎన్నిక‌లకు సిద్ధ‌మైపోయి హోదా సెంటిమెంట్ తో గెలిచి చూపిస్తామ‌ని అనుకుంటే ‘ప్ర‌త్యేక హోదా’ అంశాన్ని రాజ‌కీయాంశంగా మాత్ర‌మే చూస్తున్నట్లు అవ్వడా.?